ఉద్యోగులు, ఉపాధ్యాయుల స్థానికతకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు, ఉద్యోగులతో కలిసి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 317ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్ నేతల ఆందోళనతో పోలీసులు రంగప్రవేశం చేసి ఎమ్మెల్యే సీతక్కను బలవంతంగా అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Read Also: అగ్గిపెట్టెలో పట్టే చీర .. నేత కార్మికునికి మంత్రుల అభినందనలు
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కతో పాటు ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్, కొంపల్లి కౌన్సిలర్ జ్యోత్స్న శివారెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా పోలీసులు ఎంతమందిని అరెస్ట్ చేసినా.. తమను ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా జీవో నంబర్ 317ను రద్దు చేసేంత వరకు తమ పోరాటాన్ని ఆపేది లేదని ములుగు ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేశారు.
