తెలంగాణ ఎంసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యార్థులు పరీక్ష సమయం కన్నా రెండు గంటల ముందే ఎగ్జామ్ సెంటర్స్ కు చేరుకోవాలి. పరీక్ష ప్రారంభం అయ్యాక ఒక్క నిమిషం ఆలస్యం అయినా లోపలికి అనుమతించరు. 105పరీక్ష కేంద్రాల్లో దాదాపు రెండున్నర లక్షల మంది ఎంసెట్ పరీక్షకు హాజరుకానున్నారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ లు ధరించడంతో పాటు.. సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఆగస్ట్ ఇవాళ, రేపు, ఎల్లుండి ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్, 9, 10 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ , మెడికల్ స్ట్రీమ్ పరీక్షలు జరగనున్నాయి. రోజు రెండు సెషన్స్ ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఇంజనీరింగ్ స్ట్రీమ్ కి 6 సెషన్స్, మెడికల్ స్ట్రీమ్ 3 సెషన్స్ లో పరీక్ష జరగనుంది. ఇక కోవిడ్ బారిన పడ్డ విద్యార్థులకు అన్ని సెట్స్ అయిపోయాక పరీక్ష నిర్వస్తామని తెలిపారు ఎంసెట్ కన్వీనర్.
ఈ ఏడాది ఎంసెట్ కి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. దాదాపు 2లక్షల 51 వేల 606 మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్ లక్ష 64 వేల 962 మంది.. అగ్రి, మెడికల్ స్ట్రీమ్ 86 వేల 644 మంది విద్యార్థులు ఉన్నారు. గతేడాది కన్నా 28వేల మంది పెరగడంతో ఎగ్జామ్ సెంటర్స్ కూడా పెరిగాయి. తెలంగాణలో 82, ఏపీలో 23 పరీక్ష కేంద్రాలున్నాయి. ఈ సారి ఇంటర్ మార్స్క్ వెయిటేజ్ లేదు. ఇంటర్ మొదటి సంవత్సరం నుండి పూర్తి సిలబస్, ద్వితీయ సంవత్సరం నుండి 70 శాతం సిలబస్ నుండి ప్రశ్నలు కవర్ కానున్నాయి.15 రోజుల్లోపు పలితాలు ప్రకటిస్తామని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు.
