Site icon NTV Telugu

Moosaram Bagh Bridge: మూసారాం బాగ్ బ్రిడ్జిపై వరదనీరు.. రాకపోకలు బంద్

Moosaram Bagh

Moosaram Bagh

మూసీకి భారీగా వరద ప్రవాహం పెరిగింది. భారీ వర్షాల కారణంగా గంట గంటకు వరద పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రంగారెడ్డి, వికారాబద్‌ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు గండిపేట, ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో మూసీ నదిలోకి వరద పోటెత్తింది. నేడు వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో మూసీ పరీవాహక ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. నదిలో భారీగా వరద వస్తుండటంతో హైదరాబాద్‌లోని జియాగూడవద్ద మూసీ పొంగిపొర్లుతున్నది. చాదర్‌ఘాట్‌ లోలెవల్‌ బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తోంది.

హైదరాబాద్ లోని ముసారాంబాగ్ బ్రిడ్జి పై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ముసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. బ్రిడ్జి వద్ద ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాకపోకలు బంద్ చేయడంతో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముసారాంబాగ్ బ్రిడ్జి వద్ద వరద నీరు పోటెత్తింది. వరద కారణంగా గోల్నాక బ్రిడ్జి వైపు ట్రాఫిక్ మళ్ళిస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుండి మూసీకి వరద నీరు పెరుగుతోంది. ఘట్కేసర్ మండలం కొరియంల వద్ద మూసీ ప్రవాహం కొనసాగుతోంది. వరదల్లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడారు అంబర్ పేట పోలీస్ స్టేషన్ డి ఐ ప్రభాకర్. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు పోలీసులు. వరద ముంపు వుండే ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గండిపేట చెరువు 13 గేట్లను ఒక్కసారిగా ఎత్తివేయడంతో దిగువకు వరద పోటెత్తింది. దీంతో గండిపేట ఫాంహౌస్‌లో ఉన్న ఓ కుటుంబం వరదలో చిక్కుకున్నది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది చిన్నారి సహా ఐదుగురిని రక్షించారు. వారిని పడవల్లో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

మంగళవారం రాత్రి పది గంటలకు గండిపేట జలాశయానికి సంబంధించి 12 గేట్లు ఎత్తి 7,308 క్యూసెక్కుల నీటిని జలమండలి అధికారులు దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతం నుంచి 6,800 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తున్నది. దాదాపు 12 ఏళ్ళ తర్వాత 12 గేట్లను ఎత్తివేశారు అధికారులు. 2010లో కురిసిన భారీ వర్షాల కారణంగా అప్పట్లో ఐదు వేల పైచిలుకు క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలారు. ఇప్పుడు 7,308 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీకి నీటిని విడుదల చేయడం వల్ల లోతట్టు ప్రాంతాలవారు భయం గుప్పిట్లో బతుకుతున్నారు.

Astrology: జూలై 27, బుధవారం దినఫలాలు

Exit mobile version