Mohan Bhagwat : మాతృశక్తిని మర్చిపోవడమే దేశ పతనానికి కారణం

  • మాతృశక్తిపై భాగవత్ వ్యాఖ్యలు
  • పాశ్చాత్య భావజాలంపై విమర్శలు
  • కుటుంబ వ్యవస్థే భారత బలం
  • స్త్రీ-పురుషులు కలిసి నడవాలి
Mohan Bhaghawat

Mohan Bhaghawat

హైదరాబాద్‌లో నిర్వహించిన విశ్వమాంగల్య సభ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న అనేకమంది మహిళలు హాజరైన ఈ సభలో ‘యుగానుకూల మాతృత్వం’ అనే అంశంపై ఆయన కీలక ఉపన్యాసం చేశారు. శతాబ్దాలుగా మన సమాజంలో వస్తున్న మార్పులు, పాశ్చాత్య భావజాల ప్రభావం , భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యతను ఈ సందర్భంగా మోహన్ భాగవత్ విస్తృతంగా విశ్లేషించారు.

మాతృశక్తి సంప్రదాయం , ఆత్మవిస్మృతి

మనది అత్యంత ప్రాచీనమైన దేశమని, శతాబ్దాలుగా మనం ఇక్కడే జీవిస్తున్నామని పేర్కొన్న మోహన్ భాగవత్, ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన మాతృశక్తి సంప్రదాయం కూడా మనదేనని స్పష్టం చేశారు. అయితే కాలక్రమేణా ఆ గొప్ప సంప్రదాయం ఏమిటనే విషయాన్ని మనం దాదాపు పూర్తిగా మరిచిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మన మూలాలను, సంప్రదాయాలను విస్మరించిన తర్వాతి నుంచే మన సమాజానికి పతనం ప్రారంభమైందని, ఆ బలహీనతనే ఆసరాగా చేసుకుని విదేశీయులు మన దేశాన్ని దోచుకున్నారని అన్నారు. ముఖ్యంగా బ్రిటిష్ ఆక్రమణదారులు మన మనస్సులలో ఈ ఆత్మవిస్మృతి నిలిచిపోయేలా ఒక ప్రత్యేక వ్యవస్థను రుద్దారని, మన ప్రాచీనమైనదంతా వ్యర్థమనే తప్పుడు భావనను నూరిపోశారని విమర్శించారు.

విదేశీ దండయాత్రలు , అసంపూర్ణ దృక్పథం

సాధారణంగా మహాభారత కాలం తర్వాత నుంచి క్రమక్రమంగా మనం మన స్వంత సంప్రదాయాలను మరిచిపోతూ వచ్చామని, ఆపై మొదలైన విదేశీ దండయాత్రల వల్ల సమాజం అస్తవ్యస్తమై మన స్వదేశీ వ్యవస్థలు ధ్వంసమయ్యాయని ఆయన వివరించారు. చివరికి ఆ దండయాత్రలు మన మనస్సులలో మన స్వంత విషయాల పట్ల ద్వేషాన్ని నింపే స్థాయికి చేరాయని అన్నారు. గత 1500 నుండి 2000 సంవత్సరాల కాలాన్ని మాత్రమే మనం సంప్రదాయంగా భావిస్తున్నామని, కానీ మన అసలైన ప్రాచీన సంప్రదాయం నుండి వేరుపడి జీవించడం వల్లే ఈ అసంపూర్ణ దృక్పథం ఏర్పడిందని తెలిపారు.

పాశ్చాత్య దేశాలలో నెలకొన్న తప్పుడు ఆలోచనలు, సంపూర్ణత లేని దృక్పథం కారణంగా అక్కడ అనేక సామాజిక సమస్యలు ఉత్పన్నమయ్యాయని, మనం కూడా వారి ఆలోచనలనే గుడ్డిగా స్వీకరించడం వల్ల మనకూ సరైన సమాధానాలు దొరకడం లేదని చెప్పారు. పాశ్చాత్య చర్చలు, నరేటివ్‌లు కొన్ని ఊహాజనిత పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని, మన సంస్కృతిలో అసలు అలాంటి వాతావరణమే లేదని భాగవత్ పేర్కొన్నారు.

‘స్త్రీ-పురుషుల ఆధిపత్యం’ ఒక భ్రమ: భాగవత్

పాశ్చాత్య ప్రపంచంలో నిరంతరం నడిచే “ఎవరు గొప్ప? పురుషుడా లేక మహిళా?” అనే చర్చను ఉదాహరణగా చూపిస్తూ మోహన్ భాగవత్ మాట్లాడారు. పురుషాధిక్యతను సమర్థించేవారు పురుషుడే శ్రేష్ఠుడని అంటే, మహిళల తరఫున నిలిచేవారు మహిళలే శ్రేష్ఠులని అంటారని తెలిపారు. ఒకవేళ మహిళే శ్రేష్ఠురాలైతే కుటుంబంలో బానిసలా ఎందుకు ఉండాలని, బంధించే వివాహ బంధాన్ని ఎందుకు స్వీకరించాలని వారు ప్రశ్నిస్తుంటారన్నారు.

“మహిళ అన్నీ చేయగలదు” అనుకోవడం ఒక భ్రమ అని, అలాగే “పురుషుడు అన్నీ చేయగలడు” అనుకోవడం కూడా సమానమైన భ్రమ అని భాగవత్ స్పష్టం చేశారు. ఏ రంగంలోనైనా పురోగతి సాధించాలన్నా, సృష్టి క్రమం నడవాలన్నా మహిళ , పురుషుడు ఇద్దరూ కలిసికట్టుగా సాగడం అత్యంత ఆవశ్యకమని, ఇదే యథార్థమని వ్యాఖ్యానించారు. కానీ ప్రస్తుత సమాజం పాశ్చాత్య అసంపూర్ణ చర్చలకు కళ్లకు గంతలు కట్టుకుని ఓటేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

దృక్పథాల బంధనం – ప్రాణుల ఉదాహరణ

మనుషులు తమదైన ఆలోచనా ధోరణిలోనే బంధించబడి ఉన్నారని, మన మెదడులో ఫిట్ చేయబడిన ఒక నిర్దిష్టమైన ‘సాఫ్ట్‌వేర్’ దాటి ఆలోచించడం లేదని మోహన్ భాగవత్ ఒక ఆసక్తికర ఉదాహరణ ద్వారా వివరించారు. ఒక హాలులోని దృశ్యాన్ని చూసినప్పుడు మనుషులకు ఏడు రంగులు కనిపిస్తాయని, కానీ అక్కడికి ఒక కోడి వస్తే దాని మెదడు నిర్మాణాన్ని బట్టి దానికి మూడే రంగులు కనిపిస్తాయని చెప్పారు. అదే ఒక కుక్క వస్తే దానికి ప్రపంచం అంతా ‘బ్లాక్ అండ్ వైట్’గా రెండే రంగుల్లో కనిపిస్తుందన్నారు. కుక్కతో వెళ్లి ఏడు రంగులు ఉన్నాయని వాదిస్తే అది తన అనుభవాన్నే నిజమని నమ్ముతుంది. అలాగే మనుషులు కూడా తమ పరిమిత అనుభవాలనే ప్రమాణంగా భావిస్తూ లోపల బంధించబడి ఉన్నారని పేర్కొన్నారు.

స్త్రీ విముక్తి ఉద్యమం , కుటుంబ వ్యవస్థ పునరుద్ధరణ

పాశ్చాత్య దేశాల్లో ప్రారంభమైన ‘స్త్రీ విముక్తి ఉద్యమం’ (Women’s Liberation Movement) తీరును భాగవత్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. మహిళలు సహజంగా సున్నితంగా, భావోద్వేగంతో ఆలోచిస్తారని, వ్యూహాత్మకంగా లెక్కలు వేసుకోరని అన్నారు. అందుకే మొదట్లో ఆకర్షణీయంగా అనిపించిన ఆ ఉద్యమానికి త్వరగానే ఆమోదం లభించిందని తెలిపారు. అయితే ఆ ఉద్యమ వ్యవస్థాపకులకు, గ్రంథకర్తలకు కొద్దికాలంలోనే తమ పొరపాటు బోధపడిందన్నారు. స్త్రీ విముక్తి గురించి విషపూరితమైన కల్పనలతో పుస్తకం రాసిన ఒక ప్రముఖ రచయిత్రియే, ఆ తర్వాత తన రెండవ పుస్తకంలో “మేము తప్పుడు మార్గంలో అడుగులు వేసి రెండు తరాలను నాశనం చేశాము, రాబోయే తరాలైనా నాశనం కాకుండా ఉండాలంటే కుటుంబ వ్యవస్థను, మాతృత్వాన్ని గౌరవించాలి” అని రాసుకొచ్చారని గుర్తుచేశారు.

కుటుంబం అనేది మహిళకు అత్యంత ఆవశ్యకమైనదని, మాతృత్వం అనేది ఆమె సహజమైన నైజమని మోహన్ భాగవత్ తెలిపారు. పాశ్చాత్యులు ఎన్నో దెబ్బలు తిని తిరిగి మన మూలాల వైపే వస్తున్నప్పుడు, మనం కళ్లకు గంతలు కట్టుకుని ఆ గ్రుడ్డివారి వెనుక పరిగెడితే మనమూ దెబ్బలు తినక తప్పదని హెచ్చరించారు. ఈ జీవన సూత్రాలన్నీ మన భారతీయ సంస్కృతిలో ఆది నుండి ఉన్నాయని, యుగయుగాల అనుభవం మన వద్ద ఉందని చెప్పారు.

మన ప్రతిఒక్కరూ కాస్త లోపలికి తొంగి చూసి ఆలోచిస్తే ఎవరి ప్రబోధం లేకుండానే మన సనాతన ధర్మ సత్యం బోధపడుతుందని, నేటి సమస్యలన్నింటికీ మన ఆధ్యాత్మిక, కుటుంబ సంప్రదాయాలలోనే సరైన సమాధానాలు దొరుకుతాయని మోహన్ భాగవత్ తమ ప్రసంగాన్ని ముగించారు.