‘‘ మోదీ మస్ట్ రిజైన్’’ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. ఇటీవల శ్రీలంకలోని ఓ పవర్ ప్రాజెక్ట్ ను అదానికి కట్టబెట్టాలని శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సపై మోదీ ఒత్తడి తీసుకువచ్చారనే వార్తల నేపథ్యంలో ఈ హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు, నాయకులతో పాటు వేలాది మంది నెటిజెన్లు మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతం నుంచి ట్విట్టర్ లో ప్రారంభం అయిన మోదీ మస్ట్ రిజన్ హాష్ ట్యాగ్ ట్రెండింగ్ సాయంత్రం 8 గంటల తర్వాత కూడా అగ్రస్థానంలో కొనసాగుతోంది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, అనేక మంది ఇతర నెటిజెన్లు ట్వీట్లు చేశారు. వీటికి భారీ స్పందన లభించింది. దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు సైతం వీరికి తోడు కావడంతో ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మోదీ రాజీనామా అంశం అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీంతో జాతీయ స్థాయిలో మోదీ రాజీనామా అంశం చర్చనీయాంశంగా మారింది.
అదాని కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని, శ్రీలంక పవర్ ప్రాజెక్టును అదానీకి ఇవ్వాలని మోదీ ఒత్తిడి చేసినట్లు పోస్ట్లు చేశారు. అదానీకి అధిక ప్రాధాన్యత ఇస్తుండడంతో అసహనం వ్యక్తం చేశారు. భారత సంపద దోచి అదానీకి పంచడం సరికాదంటూ ట్విట్టర్లో పోస్టింగ్లు పెట్టారు. ఇదిలా ఉంటే ఈ హాష్ ట్యాగ్ కు కొంతమంది వ్యతిరేఖిస్తూ.. మోదీకి సపోర్ట్ గా కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే మోదీపై ఆరోపణలు చేసిన శ్రీలంక సిలోన్ విద్యుత్ సంస్థ చైర్మన్ ఫెర్డినాండో తన పదవికి రాజీనామా చేశారు. మోదీనే అదానికి విద్యుత్ ప్రాజెక్ట్ కేటాయించాలని తనపై ఒత్తడి తెస్తున్నాడని శ్రీలంక అధ్యక్షుడు తనతో చెప్పారని ఫెర్డినాండో అన్నారు. అయితే తమ మధ్య ఈ ప్రస్తావనే రాలేదని అధ్యక్షుడు గోటబయ రాజపక్స వెల్లడించారు.
