NTV Telugu Site icon

Telangana Rains: తెలంగాణకు వాతావరణశాఖ హెచ్చరిక.. నేడు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..

Telangana Rains

Telangana Rains

Telangana Rains: గత వారం వర్షాలు రాష్ట్ర ప్రజలను అతలాకుతలం చేశాయి. పగలు రాత్రి అని తేడా లేకుండా వానలు దంచికొట్టడంతో డ్యామ్ లు, చెరువులు, నదులు ఏరులై పారాయి. దీంతో ఇళ్లలోకి నీరు చేరడం, పలు గ్రామాలను నీట మునిగి పోయాయి. పొలాల్లో నీరు చేరడంతో భారీగా పంట నష్టం వాటిల్లింది. అయితే రెండు రోజులుగా వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రజలు కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించడంతో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిన్న సాయంత్రం కూడా పలుచోట్ల తేలికపాటి వర్షం కురిసింది. అయితే ఈరోజు, రేపు కూడా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరంలో అల్పపీడనం ఏర్పడగా.. రాష్ట్రంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీంతో పాటు నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు ఆదిలాబాద్, మహబూబాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ములుగు, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ప్రకటించారు. 2 నుంచి 6వ తేదీ వరకు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. ఈరోజు హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం జల్లులు కురుస్తాయని వెల్లడించారు.

Read also: August: ఆగస్టు 1నుండి మారనున్న రేట్లు.. పర్స్ ఖాళీ అవ్వొచ్చేమో

నిన్న నిర్మల్‌లో 22.5, భైంసాలో 17.5, ఖాన్‌పూర్‌లో 17.5, సిద్దిపేటలో 10.5, గంగాధరలో 8.2, ఖమ్మంలో 6.0, దుండిగల్‌లో 0.8, హకీంపేటలో 0.2 మి.మీ వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లాలో 6.4, ఖమ్మం జిల్లాలో 2.2, జగిత్యాల జిల్లాలో 1.7, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 1.6, పెద్దపల్లి జిల్లాలో 1.5 మి.మీ. అయితే తాజాగా తెలంగాణలో వారం రోజులుగా అసాధారణ రీతిలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వరద ప్రవాహంతో నదులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో కొన్ని గ్రామాలు, కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వాటర్ రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని బాధితులను రక్షించారు. కొన్ని చోట్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో బాధితులు కోలుకుంటున్న సమయంలో వర్ష సూచన రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Telangana Cabinet: కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం.. వివిధ అంశాలపై చర్చ