MLC Kavitha: మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు ఒత్తిడి కొనసాగిస్తామని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఈ రోజు ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి వివిధ పార్టీల నుంచి నాయకులు హాజరయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఒక్కో అడుగు ముందుకు వేద్దాం అని, మహిళలకు ఎవరూ ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం లేదని, అందుకే మహిళా రిజర్వేషన్లను కోరుకుంటున్నామని ఆమె అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు బిల్లు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని ఆమె అన్నారు.
Read Also: Mumbai Female Cop: ‘‘మేడమ్ క్యూట్‌గా ఉన్నావ్’’.. మహిళా పోలీస్‌ని వేధించిన ఆకతాయి
రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ.. మోదీ అధికారంలోకి రాకముందు మహిళా రిజర్వేషన్ ఇస్తామని అన్నారని, కానీ మోదీ హామీ అమలు చేయడం లేదని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉన్నా.. మహిళా రిజర్వేషన్ బిల్లును పట్టించుకోవడం లేదని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు దాదాపుగా అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయని అన్నారు. మేము మోదీని వ్యతిరేకిస్తాం కానీ మహిళా బిల్లు విషయంలో సీపీఐ పార్టీ మద్దతు ఇస్తుందని అన్నారు.
పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మా వంతు ఇస్తామని శివసేన ఉద్ధవ్ వర్గం ఎంపీ ప్రియాంకా చతుర్వేదితో పాటు ఆర్ఎల్డీ ఎంపీ ప్రతిభ తెలిపారు. ఈ సమావేశానికి సీపీఐ, శివసేన(ఉద్ధవ్), ఆర్ఎల్డీ, ఆర్జేడీ, జేఎంఎం, డీఎంకే పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశానికి టీడీపీ, వైసీపీలను ఆహ్వానించలేదు, కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించినా, ఆ పార్టీ నుంచి ఎవరూ హాజరు కాలేదు.
