Site icon NTV Telugu

Kalvakuntla Kavitha: రాముడి పేరుతో బీజేపీ రౌడీయిజం చేస్తోంది

Mlc Kavitha On Bjp

Mlc Kavitha On Bjp

MLC Kalvakuntla Kavitha Fires On BJP And ED Raids: కేంద్రంలో ఉన్న బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాముని పేరు చెప్పి బీజేపీ రౌడీయిజం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ మంత్రులపై నెల రోజులుగా ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయని.. అయితే ఈ దాడులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎల్లారెడ్డిపేట మండ‌ల ప‌రిధిలోని నాగిరెడ్డిపేట‌లో నిర్వహించిన‌ టీఆర్ఎస్ కార్యక‌ర్తల ఆత్మీయ స‌మ్మేళ‌నంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లీగల్‌గా వ్యాపారం చేసుకుంటున్నప్పటికీ, బీజేపీ తెలంగాణలో ఈడీ, ఐటీ దాడులు చేయిస్తోందని పేర్కొన్నారు. ఒక్క మంత్రిని గానీ, ఎమ్మెల్యేను గానీ, ఎంపీని గానీ విడిచిపెట్టడం లేదన్నారు. తమ అధికారులు సమాధానాలు చెప్తారని, తెలంగాణ వాళ్లు భ‌య‌ప‌డేవాళ్లు కాద‌ని స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కొందరు ప్రయత్నించారని, అడ్డంగా దొరికిన ఆ దొంగల్ని విచారణ చేయకుండా పిటిషన్లు వేశారని, కోర్టు నుంచి స్టే కూడా తెచ్చుకున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా తాము వెనక్కు తగ్గకుండా సుప్రీంకోర్టుకి వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నామన్నారు. బండి సంజ‌య్ యాద‌గిరిగుట్ట వెళ్లి దొంగ ప్రమాణాలు చేశారంటూ విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ పేరు బయటకొచ్చిందని.. విచారణకు రమ్మంటే ఆయన పారిపోయాడంటూ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు చెప్పినా విచారణకు రావడం లేదని, కోర్టుల్లో పిటిష‌న్లు వేసి విచార‌ణ‌కు రాకుండా అడ్డుకుంటున్నార‌ని తెలిపారు. బండి సంజ‌య్ నిన్న సభ పెట్టి ఏడ్చారని, తప్పు చేయనప్పుడు భయమెందుకు? అని నిలదీశారు. తమ నాయకులంతా మంచోళ్లేనని చెప్పే బండి సంజయ్.. బీఎల్ సంజయ్‌ని అరెస్ట్ చేయొద్దని కోర్టుకు ఎందుకు వెళ్లాడు? అని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ మంత్రులు ఐటీ, ఈడీ, సీబీఐ.. ఇలా ఎవరు పిలిచినా వెళ్తున్నారని, తప్పు చేయలేదు కాబట్టి భయం లేకుండా వాళ్లు విచారణకు హాజరవుతున్నారని కవిత చెప్పారు. మరి.. వాళ్లెందుకు భయపడుతున్నారు? విచారణకు ఎందుకు రావడం లేదు? అని ప్రశ్నించారు. రాజ‌కీయంగా గ‌ట్టిగా ఉన్న పార్టీని దెబ్బ కొట్టాలని, ఎదిగి వ‌చ్చిన నాయ‌కుల‌ను గ‌ద్దల మాదిరి వ‌చ్చి ఎత్తుకుపోవాల‌ని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీకి రౌడీయిజం చేయడం తప్ప మరో ఆలోచన లేదని, తాము ఈడీ దాడులకు ఏమాత్రం భయపడమని కవిత వెల్లడించారు.

Exit mobile version