తెలంగాణలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గా సాగుతుంటాయి. ఒకవైపు బీజేపీ-టీఆర్ఎస్ మధ్య వేడి రాజుకుంటున్న వేళ నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఓ ఫోన్ కాల్ లో హాట్ కామెంట్స్ చేయడంతో జిల్లా వ్యాప్తంగా ఆడియో వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారుతోంది. ఎమ్మెల్యే రేఖానాయక్ లంబాడా భాషలో దుర్భాషలతో ఓ వర్గాన్ని కించపరిచేలా మాట్లాడడంపై దళిత సంఘాలు ఆందోళన బాట పట్టారు. ఇంతకీ ఆమె వ్యాఖ్యలు ఏంటి?
నిర్మల్ జిల్లా కేంద్రంలో డిగ్రీ చదువుతున్నఖానాపూర్ నియోజకవర్గం లోని పెంబి మండలంలోని మారుమూల గ్రామానికి చెందిన కల్యాణి అనే విద్యార్థిని ఓ లీడర్ ఇంట్లో అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతిచెందగా కళ్యాణి మృతి పట్ల దళిత సంఘాలు గిరిజన సంఘాలు మద్దతుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల రాస్తారోకోలు ధర్నాలు నిర్వహించారు. ఈ విషయమై బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని బీఎస్పీ నిర్మల్ జిల్లా ఇన్ ఛార్జి బన్సీలాల్ రాథోడ్ వారిని పరామర్శించి మాట్లాడారు. డిగ్రీ చదువుతున్న గిరిజన యువతిది ఆత్మహత్య కాదు అది హత్యేనని ఆయన ఆరోపించారు.
Read Also: Taiwan: తైవాన్ లో మరో అమెరికన్ లీడర్ పర్యటన.. చైనాకు భయపడేది లేదంటూ ట్వీట్.
ఆ ఇల్లు ఖానాపూర్ నియోజకవర్గంలోని ఓ ప్రముఖ టిఆర్ఎస్ పార్టీ నాయకునికి సంబంధించిన ఇల్లు అని కళ్యాణి మృతిపై రేఖానాయక్ స్పందించకపోవడం సరికాదని బీఎస్పీ నాయకుడు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే రేఖా నాయక్ సదరు నాయకుడికి కాల్ చేసి బూతులు తిట్టారని తెలుస్తోంది. ఓ వర్గాన్ని కించపరిచేలా ఎమ్మెల్యే మాట్లాడడంతో ఖానాపూర్ నియోజకవర్గంలోని ఇంద్రవెల్లి మండల కేంద్రంలో దళిత సంఘాలు ఆందోళన, ధర్నా చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే రేఖా నాయక్ పై చర్యలు తీసుకోవాలని ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే మాటలను జిల్లా దళిత గిరిజన సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
ఎమ్మెల్యే ఫోన్ కాల్ వ్యాఖ్యలపై బిఎస్పీ జిల్లా ఇన్ ఛార్జ్ మాట్లాడుతూ తాను ఒక గిరిజన వర్గానికి చెందిన వ్యక్తిననీ …శాసనసభ సభ్యులు రేఖా నాయక్ మాట్లాడడం సమంజసమేనా అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే దళిత గిరిజన వర్గాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
