Site icon NTV Telugu

Rega Kantha Rao: బీజేపీ చావు కబురు చల్లగా చెప్తోంది

Rega Kantha Rao Bayyaram

Rega Kantha Rao Bayyaram

MLA Rega Kantha Rao Fires On BJP Over Bayyaram Project: టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు బీజేపీపై ధ్వజమెత్తారు. కొత్తగూడెం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టడం లేదని బీజేపీ చావు కబురు చల్లగా చెప్తోందని మండిపడ్డారు. ఎందుకని ప్రశ్నిస్తే.. ఉక్కు ఫ్యాక్టరీకి కావాల్సిన వనరులు లేవని చెప్తున్నారన్నారు. మరి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏం వనరులు ఉన్నాయని విశాఖ ఉక్కు పరిశ్రమ పెట్టుకున్నామని ప్రశ్నించారు. అసలు ఖనిజమేలేని విశాఖ స్టీల్స్.. 500 కి.మీ దూరం నుండి ఖనిజాన్ని, బొగ్గును, డోలమైట్‌ను తెచ్చుకొంటూ లాభాలు గడిస్తోందని.. గడిస్తుంటే అన్ని వనరులున్న బయ్యారంలో సాధ్యం కాదని చెప్పడం హాస్యాస్పదని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ఒక్క పని కూడా చేయని కేంద్ర బీజేపీ ప్రభుత్వం వల్ల ఒక్క ఉపయోగం లేదని.. అలాంటి ప్రభుత్వం ఉంటే ఎంత, పోతే ఎంత? అని ఎద్దేవా చేశారు.

చట్టబద్దంగా ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని రేగా కాంతారావు అన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం కొట్లాడి సాధించాల్సిన స్థానంలో వున్న కిషన్ రెడ్డి.. పరిశ్రమ సాధ్యం కాదని చెప్పటం సిగ్గు చేటని మండిపడ్డారు. కేంద్రమంత్రి నిస్సహాయ మంత్రిగా ఉన్నారన్న సంగతి స్పష్టంగా అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి తన ప్రకటనను వెనక్కు తీసుకొని.. కేంద్రాన్ని ఒప్పించి, బయ్యారం ఉక్కు పరిశ్రమను తీసుకు రావాల్సిందేనని నిలదీశారు. తెలంగాణ హక్కును హరించే విధంగా వ్యవహరించటం ఏమాత్రం సరికాదన్నారు. తెలంగాణా ప్రజానీకానికి మోది క్షమాపణలు చెప్పి.. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టం ద్వారా ఇవ్వాల్సిన ఉక్కు పరిశ్రమ ఇవ్వలేమని బీజేపీ చెప్పడం.. తెలంగాణపై ఆ పార్టీకి ఉన్న అభిప్రాయం ఏంటో అర్థమవుతోందని చెప్పారు.

Exit mobile version