NTV Telugu Site icon

MLA Jaggareddy : సర్వోదయ సంకల్ప పాదయాత్రలో జగ్గారెడ్డి

భూదాన్ ఉద్యమానికి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా మాజీ ఎంపీ ఏఐసీసీ, పంచాయితీ రాజ్ సంఘం చైర్ పర్సన్ మీనాక్షి నటరాజన్ సర్వోదయ సంకల్ప పాదయాత్ర ప్రారంభించారు. భూదాన్ పోచంపల్లి నుండి మహారాష్ట్రలో వర్ధా వరకు 600 కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలో నేడు ఈ పాదయాత్ర మెదక్ జిల్లాలోని మాసాయిపేట నుండి చేగుంట వరకు సాగింది. ఈ సర్వోదయ సంకల్ప పాదయాత్రలో మీనాక్షి నటరాజన్‌తో కలిసి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఉదయం మాసాయిపేట లో జరిగిన ప్రార్ధనలో పాల్గొని, అనంతరం మాసాయిపేట నుండి చేగుంట వరకు పాదయాత్ర చేశారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. భూదానోద్యమం జరిగి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మీనాక్షి నటరాజన్ చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందని, గాంధీజీ, నెహ్రూ ల కాలంలో జరిగిన ఉద్యమాలు నేటి యువత తెలుసుకోవడం లేదని ఆయన అన్నారు. ఆ రోజు గాంధీజీ పిలుపు మేరకు వేల ఎకరాలు భూములను స్వచ్ఛందంగా దానం చేసి, భూములు లేని నిరుపేదలకు పంచారు. ఆ భూదానోద్యమానికి మన రాష్ట్రం నుండే ప్రారంభం కావడం మనకు గర్వ కారణమని ఆయన వ్యాఖ్యానించారు. వేలాదిమంది మంది నిరుపేదలకు ఉపయోగపడ్డ భూదానోద్యమాన్ని గుర్తు చేస్తూ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ చైర్ పర్సన్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు.