NTV Telugu Site icon

Jagga Reddy: ఢిల్లీకి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. రేపు రాహుల్‌తో భేటీ..?

Mla Jaggareddy

Mla Jaggareddy

Jagga Reddy: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలసిందే. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభల్లో ఎక్కడా కనిపించడం లేదు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆయన ప్రస్తుతం నియోజకవర్గ రాజకీయాలకే పరిమితమయ్యారు. నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో అడపాదడపా కనిపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో జగ్గారెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఢిల్లీకి రావాలని పిలుపు నిచ్చారు. దీంతో జగ్గారెడ్డి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఢిల్లీ వెళ్లారు. రేపు ఢిల్లీలో టీపీసీసీ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. ఇందుకోసం 21 మంది తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలను ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించారు. రేపు మధ్యాహ్నం ఢిల్లీలో జరిగే టీపీసీసీ సమీక్షా సమావేశంలో ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే కూడా పాల్గొంటారని తెలుస్తోంది.

మరికొద్ది నెలల్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే పార్టీలో చేరిక, నేతల మధ్య సమన్వయం, టిక్కెట్ల పంపిణీ, పార్టీ బలోపేతంపై రాహుల్ పలు సూచనలు చేయనున్నారు. ఈ మధ్యాహ్నం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో రాహుల్ గాంధీ భేటీ కానున్నారు. వీరిద్దరూ ఇప్పటికే ఢిల్లీకి చేరుకోగా.. వారితో పాటు రేవంత్ రెడ్డి కూడా వెళ్లారు. ఆ ఇద్దరు నేతలను రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ వద్దకు తీసుకెళ్లనున్నారు. కాగా.. రాహుల్ గాంధీతో భేటీ తర్వాత పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో ఎప్పుడు చేరుతారనే దానిపై క్లారిటీ రానుంది. వీరితో పాటు ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు చేతులు కలపనున్నారు.

ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరాలని పొంగులేటి భావిస్తున్నారు. అలాగే నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించి పార్టీలో చేరే ఆలోచనలో జూపల్లి ఉన్నారు. ఈ సమావేశానికి ప్రియాంక గాంధీని ఆహ్వానించాలని చూస్తున్నారు. రాహుల్ గాంధీతో భేటీ అనంతరం ఇద్దరూ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చేరిక, బహిరంగ సభల తేదీపై పూర్తి క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. అసంతృప్త కాంగ్రెస్ నేతలను శాంతింపజేసి మళ్లీ క్రియాశీలకంగా మార్చేందుకు ఢిల్లీ హైకమాండ్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే జగ్గారెడ్డి వంటి పలువురు నేతలను కూడా సమావేశానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
BJP MP: బీజేపీ రాజ్యసభ ఎంపీ హరద్వార్ దూబే మృతి