Site icon NTV Telugu

Etela Rajender: కేసీఆర్ కు నేను.. నా కుటుంబం అనే అహం పెరిగింది

Etela

Etela

టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. మహబూబ్ నగర్ పర్యటనలో ఉన్న ఆయన కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవటం..బీజేపీ గెలువటం ఖాయమని జోస్యం చెప్పారు. ఒకసారి టీఆర్ఎస్ ఓడిపోతే మళ్లీ గెలిచే అవకాశం లేదని స్పష్టం చేశారు. గోల్ మాల్ చేయాలనుకున్నప్పుడు..ప్రజలను తప్పుదోవ పట్టించాలన్నప్పుడు కేసీఆర్ మీడియా ముందుకు వస్తాడని విమర్శించారు. కేసీఆర్ కు నేను..నా కుటుంబమనే ఆహం పెరిగిందని అన్నారు. 20 ఏళ్లుగా కేసీఆర్ తో కలిసి పనిచేసిన అనుభవం నాదని ఆయన అన్నారు.

హుజూరాబాద్ ఎన్నికల్లో 600 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు చేశావని కేసీఆర్ ను ప్రశ్నించారు ఈటెల.
రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు, ప్రమాదంలో చనిపోయినవారిపై లేని ప్రేమ పంజాబ్ రైతులపై ఎందుకని అడిగారు.ఎవరబ్బా సొమ్మని 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దేశంలో ప్రకటనలు ఇచ్చావని ప్రశ్నించారు.
ఏడాదికి రూ.40 వేల కోట్ల మద్యం ఆదాయం ఉందని చెప్పుకునే సిగ్గులేని ప్రభుత్వం టీఆర్ఎస్ ది అని విమర్శించారు.సీఎస్, కలెక్టర్లు మద్యంను ప్రమోషన్ చేసే పనిలో ఉన్నారు. వీటిపై సమీక్షలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో 6 లక్షల 80 వేల మంది మద్యానికి బానిసలైన కుటుంబాలు ఉన్నాయని అన్నారు.రోజురోజుకు పెరుగుతున్న పబ్ కల్చర్ ను బీజేపీ రూపుమాపుతుందని స్పష్టం చేశారు. ఫ్యూడల రాజకీయ మనస్తత్వం కలిగిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. కేసీఆర్ కు పోయే కాలం వచ్చిందని.. ప్రజానాడి తెలిసిన ప్రజా నాయకుడికి పీకే అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రం ఆరిపోయే దీపంలా ఉందని.. పాలకులకు వత్తాసు పలికి పోలీసులు తలదించుకునేలా వ్యవహరించవద్దని.. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ కు వేసినట్లే అని.. మళ్లీ ఇద్దరూ కలిసి కేసీఆర్ నే సీఎం చేస్తారని అన్నారు.

Exit mobile version