Mir Alam Lake : మిర్ ఆలం చెరువుకు మహర్దశ.. హైదరాబాద్‌లో కొత్త టూరిజం హబ్

  • మిర్ ఆలం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జి
  • కుటుంబాలను ఆకట్టుకునే వాటర్ స్పోర్ట్స్
  • ఐలాండ్లకు సరికొత్త టూరిజం హంగులు
  • డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు ప్రత్యేక వేదికలు
  • నెహ్రూ జూతో సమగ్ర అనుసంధానం
Mir Alam Lake

Mir Alam Lake

Mir Alam Lake : హైదరాబాద్ నగరంలోని చారిత్రక ప్రాధాన్యం కలిగిన మిర్ ఆలం చెరువుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త హంగులు అద్దబోతోంది. కుటుంబ సమేతంగా వచ్చి రోజంతా ప్రకృతి అందాలు, జలక్రీడలు , వినోదాన్ని ఆస్వాదించేలా దీనిని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం మిర్ ఆలం చెరువును అకస్మికంగా పరిశీలించారు. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సుందరీకరణ పనులు , సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణ పురోగతిని అధికారులతో సమీక్షించిన సీఎం, పనులన్నింటినీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

సస్పెన్షన్ బ్రిడ్జి పనుల్లో 50 శాతానికి పైగా పురోగతి

మిర్ ఆలం చెరువుపై నిర్మిస్తున్న ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జి పనులు శరవేగంగా సాగుతున్నాయి. లక్ష్యంగా పెట్టుకున్న 544 పైల్స్‌లో 273 (50.18 శాతం) పైల్స్ పూర్తి కాగా, 62 పైల్ క్యాప్స్‌లో 28 (45.16 శాతం) పనులు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. చెరువు పునరుజ్జీవనం, చెరువు పరిసర ప్రాంతాలు , ఐలాండ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా చెరువులోకి ఎలాంటి మురుగు నీరు చేరకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని, వర్షపు నీరు మూసీ నదిలోకి సాఫీగా వెళ్లేలా నాలాలను విస్తరించి నీటి నాణ్యతను పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

వాటర్ స్పోర్ట్స్, ఐలాండ్లు , డెస్టినేషన్ వెడ్డింగ్స్!

యువతతో పాటు కుటుంబాలను ఆకట్టుకునేలా మిర్ ఆలం చెరువులో బోటింగ్, వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ కార్యకలాపాలను అందుబాటులోకి తేనున్నారు. పర్యావరణ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా చెరువు చుట్టూ ఫుడ్‌కోర్టులు, పచ్చని పార్కులు, చిన్నారుల కోసం ప్రత్యేక ఆట స్థలాలు , వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు కానున్నాయి. అంతేకాకుండా, చెరువులో ఉన్న ఐలాండ్లను ప్రకృతి ఆధారిత విశ్రాంతి కేంద్రాలుగా, టెంట్లు వేసుకునే గ్లాంపింగ్ స్పాట్లుగా , డెస్టినేషన్ వెడ్డింగ్స్, ఈవెంట్లకు అనుకూలమైన వేదికలుగా రూపుదిద్దనున్నారు. ఈ నాణ్యమైన సౌకర్యాల కోసం పిపిపి (PPP) విధానంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించి స్థానికులకు ఉపాధి కల్పిస్తారు.

జూ పార్కుతో అనుసంధానం – సమగ్ర పర్యాటక అనుభూతి

సమీపంలోనే ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్కుతో మిర్ ఆలం ట్యాంక్ అభివృద్ధిని సమగ్రంగా అనుసంధానించాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. దీనివల్ల జూ పార్క్ సందర్శనకు వచ్చే పర్యాటకులు ఒకే పర్యటనలో చెరువు అందాలు, జలక్రీడలు , కుటుంబ వినోదాన్ని పొందగలుగుతారు. విమానాశ్రయానికి సమీపంలో ఉండే ఈ చారిత్రక ప్రాంతం అభివృద్ధి చెందితే, హైదరాబాద్ నగరవాసులతో పాటు దేశ, విదేశీ పర్యాటకులకు మిర్ ఆలం ట్యాంక్ ఒక ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా మారనుంది.