Site icon NTV Telugu

Basara IIIT: చ‌ర్చ‌లు స‌ఫ‌లం.. నేటి నుంచి త‌ర‌గ‌తుల‌కు

Sabitha Indrareddy

Sabitha Indrareddy

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో విద్యార్థులు గత వారం రోజులుగా చేస్తున్న శాంతియుత నిరసనకు తెరపడింది. సోమవారం అర్ధరాత్రి విద్యాశాఖ ఉన్నతాధికారులతోపాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా వచ్చి చర్చించడం, నెలరోజుల్లో డిమాండ్లన్నీ నెరవేరుస్తమని హామీ ఇవ్వడంతో.. అర్ధరాత్రి 12.30 ప్రాంతంలో విద్యార్థులు ఆందోళన విరమించారు. నేటి నుంచి విద్యార్థులు తరగతులకు హాజరువుతామని ప్రకటించారు.

బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు పట్టువీడకుండా ఆందోళన చేస్తుండటంతో స్వయంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం రాత్రి 9గంటలకు బాసర చేరుకున్నారు. ఆమెతోపాటు ఆర్జీయూకేటీ ఇన్‌చార్జి వీసీ రాహుల్‌ బొజ్జా, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.వేణుగోపాలాచారి, ముధోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, నిర్మల్‌ కలెక్టర్‌ ముషరఫ్‌ అలీ, అడిషనల్‌ కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ఆర్జీయూకేటీ కొత్త డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సతీశ్‌కుమార్‌ తదితరులు క్యాంపస్‌కు వచ్చారు. తొలుత దాదాపు యాభై మంది విద్యార్థులతో అధికారులు చర్చించాక.. రాత్రి 10.25 గంటల సమయంలో మంత్రి సబిత వారితో మాట్లాడారు. సోమవారం అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగాయి.

ఈ సందర్భంగా నెలరోజుల్లో డిమాండ్లన్నింటినీ తీరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అయితే రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని విద్యార్థులు కోరగా.. ‘సంబంధిత మంత్రిని స్వయంగా చెప్తున్నా.. ఇంకా ఎలాంటి హామీ కావాలి’ అని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆందోళన విరమించాలా, కొనసాగించాలా అన్నదానిపై చర్చించుకున్న విద్యార్థులు.. అనంతరం క్యాంపస్‌ ప్రధాన గేటు వద్దకు వచ్చి మీడియాతో మాట్లాడారు. డిమాండ్లను పరిష్కరిస్తారని మంత్రిపై, అధికారులపై నమ్మకం ఉందని.. ఆందోళన విరమిస్తున్నామని ప్రకటించారు. నేటి నుంచి తరగతులకు హాజరవుతామని తెలిపారు.

TVS XL Thief: వస్తాడు.. దొంగలిస్తాడు.. రిపీట్!

Exit mobile version