Site icon NTV Telugu

SSC Exams: ఏపీలో పేపర్‌ లీక్‌లు.. అలెర్ట్‌ అయిన తెలంగాణ సర్కార్..

Sabitha Indra Reddy

Sabitha Indra Reddy

ఏపీలో ఈ మధ్య జరిగిన టెన్త్‌ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీక్‌ వ్యవహారం కలకలం సృష్టించింది.. అయితే, ఈ నెల నుంచి తెలంగాణలోనూ టెన్త్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. దీంతో, అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.. పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. పదవ తరగతి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతీ పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలని స్పష్టం చేశారు. మే 23వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు 5,09,275 మంది విద్యార్థులు హాజరుకానున్నట్టు వెల్లడించారు మంత్రి సబిత.

Read Also: Buddha Purnima: బుద్ధుని బోధనలను స్మరించుకున్న కేసీఆర్‌..

పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వర్తించే సిబ్బందిని కూడా మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో కేంద్రాల్లోకి అనుమతించకూడదని ఆదేశాలు జారీ చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. పరీక్షల నిర్వహణ సందర్భంగా ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా.. వెంటనే పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర డైరెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేయాలని సూచించిన ఆమె.. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద డీఈవో, ఎంఈవో ఫోన్ నెంబర్లను డిస్‌ప్లే చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లను ఆయా పాఠశాలలకు చేర్చడం జరిగింది.. హెచ్‌ఎంలను కలిసి హాల్ టిక్కెట్లను పొందాలని విద్యార్థులకు సూచించారు.

ఇక, పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ ప్రసారంలో అంతరాయం కలగకూడదని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి సబిత.. విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు సకాలంలో చేరుకునేందుకు అవసరమైన రీతిలో ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసేందుకు ఆయా జిల్లా కలెక్టర్లు చర్యలుచేపట్టాలి సూచించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతీ పరీక్షా కేంద్రంలో ఒక ఏఎన్ఎం, ఒక ఆశా ఉద్యోగినిని ఓఆర్ఎస్ పాకెట్లు, అవసరమైన మందులతో సిద్ధంగా ఉంచుతున్నాం, పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించేందుకు వీలుగా జిల్లాల వారిగా పరిశీలకులను నియమించడం జరుగుతుందని తెలిపారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో తాగునీరు, ఫర్నీచర్, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్ సౌకర్యం ఉండేలా ముందస్తుగానే తనిఖీలను నిర్వహించాలని.. ఎక్కడైనా లోపాలున్నట్లయితే పరీక్షలను నిర్వహించే నాటికి వాటిని పరిష్కరించాలని స్పష్టం చేశారు.. ఇక, పదవ తరగతి పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరు కావాలని సూచించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

Exit mobile version