ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై కీలక ఆదేశాలు ఇచ్చారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. పరీక్షల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఇంటర్ విద్యా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె.. ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయినట్టు వెల్లడించారు.. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేశామని.. ఈ సారి నాలుగు లక్షల 58 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరు అవుతారని వెల్లడించారు. అయితే, కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను 14 వందల నుండి 1750కి పెంచామని తెలిపారు.. ప్రతి పరీక్ష కేంద్రంలో ఐసోలేషన్ సెంటర్ ఉండాలని ఆదేశించిన ఆమె.. విద్యార్థులు ఆందోళన పడకుండా పరీక్షలు రాయాలని సూచించారు.
విద్యార్థిలకు స్టడీ మెటీరియల్ ఇచ్చాం… పరీక్ష పత్రాల్లో ఛాయిస్ పెంచాం అన్నారు మంత్రి సబిత.. గంట ముందే విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసిన ఆమె.. 25 వేల మంది ఇన్విజిలేటర్స్ ఉంటారని.. వాక్సినేషన్ పూర్తి అయిన వారినే ఇన్విజిలేటర్ లుగా నియమిస్తున్నాం అన్నారు. ఇక, పాఠశాలలను కూడా పరీక్ష కేంద్రాలకు ఉపయోగిస్తున్నాం.. ఆ పాఠశాలల్లో మధ్యాహ్నం క్లాసెస్ ఉంటాయని తెలిపారు.. విద్యార్థులను ప్రమోట్ చేసే సమయంలోనే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పామన్నారు. కాగా, ఈ నెల 25 నుండి వచ్చే నెల 3 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది ప్రభుత్వం.. మరోవైపు.. తమ డిమాండ్స్ పరిష్కరించక పోతే పరీక్షలు బహిష్కరిస్తామని ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు ప్రకటించాయి.. అయితే, ప్రైవేట్ జూనియర్ కాలేజీల తీరుపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.. పరీక్షల సమయంలో సహకరించం అని అనడం సరైంది కాదన్న ఆమె.. ఏదన్నా ఉంటే కలిసి మాట్లాడుకొని పరిష్కరించుకోవాలన్నారు. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని పరీక్షల నిర్వహణకు ప్రైవేట్ విద్యా సంస్థలు సహకరించాలని.. పరీక్షల సమయంలో స్టేట్ మెంట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదని.. వాళ్లకు చెప్పాలంటూ ఇంటర్ బోర్డ్ కార్యదర్శిని ఆదేశించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.