NTV Telugu Site icon

Ponnam Prabhakar: అత్యంత వైభవంగా బోనాల ఉత్సవాలు.. పొన్నం ప్రభాకర్‌ సమీక్ష..

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar: హైదరాబాద్ కలెక్టరేట్‌లో ఆషాడ మాసం బోనాల వేడుకలపై తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా బోనాల ఉత్సవాలు నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా జరుపుకుంటున్న బోనాల పండుగను గతంలో కంటే అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని 2,400 ఆలయాలకు చెక్కుల పంపిణీ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈసారి ఆలయాలకు ఇచ్చే సొమ్మును పెంచాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి వెల్లడించారు. బోనాల సందర్భంగా ఆలయాలకు వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కాగా, వచ్చే నెల 7 నుంచి బోనాల ఉత్సవం ప్రారంభం కానుంది.

Read also: Gold Rate Today: మగువలకు భారీ షాక్.. తులం బంగారంపై రూ.810 పెరిగింది!

జూలై 7న ఆషాఢమాసం మొదటి ఆదివారం భాగ్యనగరంలో బోనాల సంబరం ప్రారంభమవుతుంది. గోల్గొండ ఎల్లమ్మ ఆలయంలో తొలి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ మహంకాళి ఆలయాల్లో ప్రతి గురు, ఆదివారాలు నెల రోజుల పాటు నిర్వహిస్తారు. జూలై 7వ తేదీ ఆదివారం – గోల్గొండ జగదాంబికకు తొలిబోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జూలై 11 గురువారం – రెండవ పూజ, జూలై 14 ఆదివారం – మూడవ పూజ కాగా.. జూలై 18 గురువారం – నాల్గవ పూజ నిర్వహిస్తారు. జూలై 21 ఆదివారం – ఐదవ పూజ, జూలై 25 గురువారం – ఆరోపూజ, జూలై 28 ఆదివారం – ఏడవ పూజ కాగా.. ఆగస్ట్ 1 గురువారం – ఎనిమిదవ పూజ అనంతరం.. ఆగస్టు 4 ఆదివారం – తొమ్మిదవ పూజ చేస్తారు. అంటే జూలై 7వ తేదీ ఆదివారం ప్రారంభమయ్యే బోనాలు…ఆగస్టు 4వ తేదీ ఆదివారంతో ముగుస్తాయి.