కామారెడ్డి జిల్లా బీబీ పేట మండలం కోనాపూర్ లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. అనంతరం కోనాపూర్‌లో నానమ్మ వెంకటమ్మ జ్ఞాపకార్థంగా నిర్మించే స్కూల్ బిల్డింగ్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. పలు ఆసక్తికర విషయాలను కేటీఆర్ సభా వేదికగా వెల్లడించారు. మానేరు ప్రాజెక్టుకు మాకు అవినాభావ సంబంధం ఉందని అన్నారు. ఈ అనుబంధం గురించి తెలియజేసేందుకు కేటీఆర్ తమ పూర్వీకుల కథ చెప్పుకొచ్చారు. నానమ్మ ఊరు అప్పర్ మానేరులో, అమ్మమ్మ ఊరు మిడ్ మానేరులో, ఇంకో అమ్మమ్మ(అమ్మ సోదరి) ఊరు కూడా లోయర్ మానేరులో మునిగిపోయిందని కేటీఆర్ గుర్తు చేశారు. నానమ్మ, అమ్మమ్మల జ్ఞాపకార్థంగా మన ఊరు – మన బడి ప్రోగ్రాం కింద తన సొంత ఖర్చులతో పాఠశాలలను నిర్మిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.
పోసన్ పల్లి గురించి నానమ్మ చెప్తుంటే విన్నదే తప్ప చూసింది లేదని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు బీబీపేట్ వచ్చి ఇక్కడికి రాలేకపోయాను. బీబీపేట్‌లో సుభాష్ రెడ్డి పాఠశాల కట్టించినప్పుడు తాను కూడా పోసాన్ పల్లిలో నానమ్మ జ్ఞాపకార్థం బడి కట్టిస్తానని హామీ ఇచ్చానని అన్నారు. అందులో భాగంగానే మన ఊరు – మన బడి కార్యక్రమం కింద నానమ్మ, అమ్మమ్మ ఊరిలో బడులు కట్టిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. రూ. రెండున్నర కోట్లతో నానమ్మ పేరు మీదు బడిని కడుతున్నానని సభలో పేర్కొన్నారు. నానమ్మ ఆత్మ శాంతించాలని, ఈ ఊరికి సొంతంగా మేలు చేసిన వాళ్లం కావాలని ఈ నిర్ణయం తీసుకున్నానని కేటీఆర్ తెలిపారు.
మాకుటుంబ చరిత్ర తెలుసుకోకుండా మామీద నిందలు వేస్తున్నారని మండి పడ్డారు కేటీఆర్. కొందరు కేసీఆర్ గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పుట్టుకతోనే భూస్వామి అని మంత్రి కేటీఆర్ అన్నారు. 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని గుర్తు చేశారు. 60 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు ఇస్తున్నామని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రాన్ని సస్యశామలం చేశామని అన్నారు. ఇంటింటికి నీళ్లు, 24 గంటల కరెంట్, పెన్షన్లు.. పల్లె ప్రకృతి వనాలు .. 60 ఏళ్లల్లో జరగని అభివృద్ధి 7 ఏళ్ళల్లో చేశామన్నారు. చిల్లర మాటలను పట్టించుకోమని మండిపడ్డారు. తెలంగాణలో కార్పొరేట్ స్థాయిలో పాఠశాలలను అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ ఈసందర్భంగా పేర్కొన్నారు.
