Site icon NTV Telugu

KTR: బీజేపీకి అవకాశం ఇస్తే.. తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలిపేస్తారు

నిజామాబాద్ పర్యటనలో బీజేపీపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ నేతలు యువకులు, విద్యార్థులను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు బీజేపీ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఎందుకు వివక్ష చూపుతున్నారని నిలదీశారు. మోదీ ప్రధానిగా అధికారం చేపట్టి ఏడేళ్లు దాటుతున్నా తెలంగాణకు ఎలాంటి ప్రాజెక్టులు మంజూరు చేయలేదన్నారు.

బీజేపీ నేతలు విషం చిమ్మకుండా విషయాలు మాట్లాడితే బాగుంటుందని మంత్రి కేటీఆర్ హితవు పలికారు. తెలంగాణ పుట్టుకను ప్రశ్నించిన బీజేపీకి తెలంగాణలో పుట్టగతులు ఉండాలా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. గిరిజన యూనివర్సిటీ కావాలని అడిగితే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ప్రధాని మోదీ నెరవేర్చలేదన్నారు. ఉపాధి హామీకి 25 శాతం నిధులు తగ్గించారని ఆరోపించారు. జీవితాలు మార్చమంటే జీవిత బీమాను అమ్మేశారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇస్తే.. తెలంగాణను మళ్లీ ఏపీలో కలిపేస్తారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ దేశం కోసం, ధర్మం కోసం అంటూ డైలాగులు చెప్పడం తప్ప చేసిందేమీ లేదన్నారు. మోదీకి యూపీకి మాత్రమే ప్రధాని అని కేటీఆర్ విమర్శించారు.

Exit mobile version