NTV Telugu Site icon

Minister KTR: డబ్బా బిల్డింగులే కాదు.. అట్రాక్టివ్‎గా కూడా నిర్మాణాలు జరగాలి

Ktr

Ktr

Minister KTR: డబ్బా బిల్డింగులే కాదు.. అట్రాక్టివ్‎గా కూడా నిర్మాణాలు జరగాలని ఐటీ మంత్రి కేటీఆర్ సూచించారు. హైదరాబాద్‌లో పెరుగుతున్న భూముల ధరలు, అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుంటుందని కేటీఆర్ అన్నారు. ఏ నగరమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం మొత్తం మీద పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి సమతూకం చేస్తున్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన టైమ్స్ ఆఫ్ ఇండియా, టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్‌పో-2023ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సాగునీరు, తాగునీరు, వ్యవసాయ రంగం, పరిశ్రమలు, విద్యుత్ వంటి అన్ని రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. తెలంగాణ రాకముందు ఏడు వేల మెగావాట్ల విద్యుత్ ఉండేదని, పవర్ హాలిడేలతో పరిశ్రమలకు సెలవులు ఇచ్చేవారన్నారు. జిరాక్స్ సెంటర్ నడపడానికి కూడా కరెంటు లేదన్నారు. కానీ, నేడు రాష్ట్రంలో 26 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంది. గతంలో హైదరాబాద్ నగరంలో నిత్యం తాగునీటి సమస్య ఉండేదని, సీఎం కేసీఆర్ దార్శనికతతో కృష్ణా, గోదావరి నదుల నుంచి వందల కిలోమీటర్ల మేర నీటిని తీసుకొచ్చి నగరవాసులకు తాగునీరు అందించడం జరిగిందన్నారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా 10 శాతం తాగునీరు అందిస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో హైదరాబాద్‌లో తాగునీటికి కొరత ఉండదని స్పష్టం చేశారు.

Read also: Ganesh Nimajjanam: గణేశ్ నిమజ్జనంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. గతేడాది ఉత్తర్వులే అమలు..!

హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన ప్రతి ఒక్కరు చెబుతూనే ఉన్నారని, సినీ హీరో రజనీకాంత్‌ లాంటి వారికి కూడా ఇది న్యూయార్క్‌నా.. హైదరాబాద్‌ అనే సందేహం ఉండేదని గుర్తు చేశారు. గ్లోబల్ సిటీగా పోటీ పడాలంటే మౌలిక వసతులను మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వరకు మెట్రో టెండర్లు కూడా పూర్తయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. నగరం చుట్టూ మెట్రో కనెక్టివిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిందని తెలిపారు. ఏ రంగంలోనైనా రాజధానికి మంచి శాంతి భద్రతలు ఉండాలి. గతంలో ఏ పండుగకు హైదరాబాద్ లో వారం రోజుల పాటు కర్ఫ్యూ ఉండేదని, తెలంగాణ వచ్చాక అలాంటి పరిస్థితి ఇంతవరకు రాలేదన్నారు. హైదరాబాద్ కే పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రియల్ ఎస్టేట్ రంగం పెరిగిందని వెల్లడించారు. మెట్రో రైలు విస్తరణ, మూసీని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. మనకు గొప్ప దార్శనికత కలిగిన నాయకుడు కేసీఆర్ ఉన్నారని, హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్ అంటే గచ్చిబౌలి, కొండాపూర్ అని, న్యూయార్క్ లాంటి నగరాల్లో కూడా పాత పట్టణాలు ఉన్నాయని కొందరు విమర్శిస్తున్నారు. స్కై టవర్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతినిచ్చి హరిత భవనాలను ప్రోత్సహిస్తున్నదని వెల్లడించారు. డబ్బా బిల్డింగులే కాదు.. అట్రాక్టివ్‎గా కూడా నిర్మాణాలు జరగాలని సూచించారు. బిల్డర్లు హైదరాబాద్ పశ్చిమ వైపు మాత్రమే కాకుండా ఇతర వైపులను కూడా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. అక్కడ కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున సౌకర్యాలు కల్పించిందని, సౌత్ , ఈస్ట్ హైదరాబాద్ పై బిల్డర్లు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
Chandrababu Arrest: ‘ఇంకా చాలా మంది బయటకు వస్తారు’