Site icon NTV Telugu

కరీంనగర్ అభివృద్దిపై టీఆర్ఎస్ ఫోకస్ !

ఈటల రాజేందర్ ఎపిసోడ్ నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కార్ కరీంనగర్ అభివృద్దిపై ఫోకస్ చేసనట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే కరీంనగర్ లోయర్ మానేరు కింద చేపట్టనున్న మానేరు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రణాళికల పైన ఈరోజు హైదరాబాద్ నగరంలో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. మంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. మానేరు రివర్ ఫ్రంట్ ని దేశంలోని ఇతర ప్రాజెక్టుల కన్నా అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రాజెక్టుతో సంబంధమున్న ఇరిగేషన్, రెవెన్యూ, టూరిజం, మునిసిపల్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ వంటి శాఖలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకుపోవాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు.

ఈ ప్రాజెక్టు డెవలప్మెంట్ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ లేదా ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ముఖ్యమంత్రి గారు తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఈ మానేరు రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు అవకాశం ఏర్పడిందని, ముఖ్యమంత్రి గారు కేవలం సాగునీటి కోసమే కాకుండా ఈ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు టూరిజం వంటి రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించేలా, ఉపాధి అవకాశాలు పెంచేలా ప్రణాళికలు వేశారని, అందులో భాగంగానే కాళేశ్వరంతో పాటు కరీంనగర్ వద్ద మానేరు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ వంటి కార్యక్రమాలకు రూపకల్పన చేశారని ఆయన అన్నారు. ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం కోసం 310 కోట్ల రూపాయలను కేటాయించిన నేపథ్యంలో అద్భుతమైన డిజైన్లతో ఈ ఫ్రంట్ డెవలప్మెంట్ ని చేయాల్సిన అవసరం ఉందన్నారు.

దేశంలో పలు ఇతర రాష్ట్రాలు ఇలాంటి రివర్ ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రాల రాజధాని ప్రాంతాల్లోనే చేశాయని అయితే ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు కరీంనగర్ పట్టణంలో ఇంత భారీ ఖర్చుతో ఒక టూరిస్ట్ అట్రాక్షన్ డెవలప్ చేయాలన్న విజన్ తో ఈ కార్యక్రమం ప్రారంభమైందన్నారు. ప్రాజెక్టు కేవలం కరీంనగర్ పట్టణానికి కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక టూరిస్ట్ అట్రాక్షన్ గా మారే అవకాశం ఉన్నదని, పూర్తిస్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్, వరంగల్ వంటి జిల్లాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కరీంనగర్ పట్టణానికి ఐటీ టవర్ ద్వారా ఐటీ పరిశ్రమ కంపెనీలను తరలించే ప్రయత్నం చేస్తున్నామని, రివర్ ఫ్రంట్ కార్యక్రమం పూర్తయిన తర్వాత కరీంనగర్ పట్టణం మరింతగా అభివృద్ధి అవుతుందన్న ఆశాభావం కేటీఆర్ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ కి అవసరమైన సహాయ సహకారాలను సాగునీటి శాఖతో పాటు భూసేకరణ వంటి అంశాల్లో రెవెన్యూ శాఖ మరింత వేగంగా ముందుకు పోవాలి అన్నారు.

Exit mobile version