Site icon NTV Telugu

Telangana: దటీజ్ కేటీఆర్.. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఉన్నత విద్య అభ్యసించ‌డం కోసం ఇద్దరు అక్కాచెల్లెళ్లకు ఆర్థిక సహాయం చేస్తానని గత నెల 23న మంత్రి కేటీఆర్ ప్రకటించగా తాజాగా సాయం అందించారు. వివరాల్లోకి వెళ్తే… జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన రాజమల్లు ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేశాడు. కోవిడ్ సమయంలో ఆయన ఉపాధి పోయింది. దీంతో కూలీ పనులు చేస్తూ తన పిల్లలను చదివిస్తున్నాడు. ఆయన ఇద్దరు కుమార్తెలు కావేరి (21), శ్రావణి (18) ఇంటర్‌లో 95 శాతం మార్కులతో పాసయ్యారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కుమార్తెలకు మెరిట్ ఆధారంగా బీటెక్‌లో సీటు వచ్చింది.

అయితే ట్యూష‌న్ ఫీజులు, హాస్టల్‌, మెస్ ఫీజులు చెల్లించ‌డం చాలా క‌ష్టంగా మారింది. దీంతో విద్యార్థినుల దగ్గర డ‌బ్బులు లేవ‌ని.. వాళ్ల తండ్రి కూలీ ప‌ని చేస్తున్నాడ‌ని మీడియాలో వార్తలు రాగా.. ఈ విషయం కేటీఆర్ దృష్టికి వచ్చింది. దీంతో కేటీఆర్ వెంటనే స్పందించి విద్యార్థినుల ల‌క్ష్యం ఆగిపోకుండా భరోసా కల్పించారు. వాళ్లు మెడిసిన్, ఇంజనీరింగ్ పూర్తి చేసే దాకా అయ్యే మొత్తం ఖ‌ర్చును తానే భ‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఇద్దరు విద్యార్థినులు తమ తండ్రితో కలిసి ఆదివారం నాడు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వాళ్లకు మంత్రి కేటీఆర్ చెక్కు అందజేశారు. తమ ఉన్నత చ‌దువుల కోసం ఆర్థిక సాయం అందించిన మంత్రి కేటీఆర్‌కు ఇద్దరు విద్యార్థినులు కృత‌జ్ఞత‌లు తెలిపారు.

Exit mobile version