Site icon NTV Telugu

KTR: రాజకీయాలకు అతీతంగా ఉంటేనే దేశం అభివృద్ధి.. ఆ విశ్వాసం మాకుంది..

Minister Ktr

Minister Ktr

నిర్ణయాలు రాజకీయాలకు అతీతంగా తీసుకున్నప్పుడే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వాసం మాకు ఉందని తెలిపారు తెలంగాణ మంత్రి కేటీఆర్… హైదరాబాద్‌లో జరిగిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అండ్ కామర్స్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన విభజన హామీల తోపాటు వివిధ పథకాల కింద రావాల్సిన సహాయ సహకారాలను అందించడంలో కేంద్రం శీతకన్ను వేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి దక్కాల్సిన బయ్యారం స్టీల్ ప్లాంట్ నుంచి మొదలుకొని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, నేషనల్ డిజైన్ సెంటర్, ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాల వరకు అనేక హామీలను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: KTR Tour: రాహుల్‌ కంటే ముందే వరంగల్‌కి.. 2 రోజుల్లో కేటీఆర్‌ టూర్..

తెలంగాణ ప్రభుత్వం అడిగిన ఇండస్ట్రియల్ కారిడార్ లతోపాటు డిఫెన్స్ కారిడార్ ఫార్మాసిటీ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లకు అవసరమైన ఆర్థిక సహాయం వంటి అనేక అంశాలపై కేంద్రం స్పందించడం లేదన్నారు మంత్రి కేటీఆర్.. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ రంగ సంస్థలను పునరుద్ధరించడంపైన అత్యంత విశ్వాసం కలిగి ఉన్నది.. ఈ దిశగా ఆదిలాబాద్‌లోని సీసీఐని పునరుద్ధరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఏడున్నర సంవత్సరాలలోనే దేశంలో అత్యంత విజయవంతమైన రాష్ట్రంగా నిలిచిన తెలంగాణకు కేంద్రం ప్రోత్సాహం ఇవ్వడంలో చొరవ చూపడం లేదన్న ఆయన.. తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయాలకు అతీతంగా ఉన్నప్పుడే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వాసం మాకు ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధి అంటే భారతదేశ అభివృద్ధి అనే విషయాన్ని కేంద్రం గుర్తించాలి.. ఏడున్నర సంవత్సరాలుగా పర్ క్యాపిట ఇన్కమ్ తోపాటు జీఎస్‌డీపీ వంటి అంశాల్లో రెట్టింపు వృద్ధిని నమోదు చేసిందని.. తెలంగాణ నుంచి వచ్చే సంపద దేశంలోని ఇతర వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి వినియోగం జరుగుతుందన్న అంశం తమకు గర్వకారణంగా ఉందని తెలిపారు. అయితే, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం మరింత సహకారం అందించాలని పేర్కొన్నారు. మేకిన్ ఇండియా నినాదం నిజరూపం దాల్చాలంటే కేంద్ర ప్రభుత్వం మరిన్ని పారిశ్రామిక ప్రోత్సాహకాలతో పాటు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే సాధ్యమవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్.

Exit mobile version