హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. ఈ నెల 16వ తేదీ నుంచి ఈ పథకం అమలు చేయాలని దళిత బంధు పథకంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయించారు సీఎం కేసీఆర్.. అయితే, దళిత బంధుపై ఎలాంటి అపోహలు, అనుమానాలు వద్దు అని చెబుతున్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దళిత బంధు ఆపించే కుట్రలు జరుగుతున్నాయని.. దళిత బంధు అమలు అయితే పుట్టగతులు ఉండవనే భావనతో ఇతర పార్టీల వారు ఈ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇక, దళిత బంధుపై ఎలాంటి అపోహలు, అనుమానాలు వద్దన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్.. అధికారుల బృందం సర్వే చేస్తున్నాయి.. ప్రతి కుటుంబానికి వస్తుందన్న ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన రోజు లాంఛనంగా కొంత మందికి ఇస్తారని.. పథకం ప్రారంభం అయిన మరుసటి రోజు నుండి లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు పడతాయని వెల్లడించారు. సర్వే పూర్తి అయిన తర్వాత ఒకే సారి అందరికి దళిత బంధుకు సంబంధించిన డబ్బులు వస్తాయని తెలిపారు కొప్పుల ఈశ్వర్. కాగా.. సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఇప్పటికే దళిత బంధు పథకాన్ని అమలు చేస్తోంది సర్కార్.. ఇప్పుడు పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్‌లో అమలు చేయనున్నారు.. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలు చేయాలన్న ప్లాన్‌లో ప్రభుత్వం ఉంది.