Former OSD Sumanth : మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీగా పనిచేసిన సుమంత్‌పై హైదరాబాద్‌లో తీవ్రమైన హత్యాయత్నం (Attempt to Murder) కేసు నమోదైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి గోంగిడి హరికృష్ణపై సుమంత్ మరో ఐదుగురు అనుచరులతో కలిసి ఇనుప రాడ్లు, కర్రలతో దారుణంగా దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై మేడిపల్లి పోలీసులు ముందుగా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, తదుపరి విచారణ నిమిత్తం కేసును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
డెన్‌కు పిలిపించి దాడి.. బెదిరింపులు
పోలీసుల వివరాల ప్రకారం.. బోడుప్పల్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గోంగిడి హరికృష్ణను కలవాలని కోరుతూ సుమంత్ గతంలో ఫోన్ చేశారు. అయితే, ఆ సమయంలో తాను అందుబాటులో లేకపోవడంతో తర్వాత కలుస్తానని హరికృష్ణ తెలిపారు. అనంతరం హరికృష్ణ తన స్నేహితుడు రాము కార్యాలయానికి వెళ్లగా, అక్కడ సుమంత్ ప్రత్యక్షమయ్యారు. “నా పేరు ఉపయోగించుకుని బయట ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నావ్?” అని ప్రశ్నిస్తూ సుమంత్ హరికృష్ణపై తీవ్రంగా మండిపడ్డారు. తాను ఎలాంటి డబ్బులు వసూలు చేయలేదని చెప్పినప్పటికీ వినకుండా, దుర్భాషలాడుతూ ఇనుప రాడ్డుతో కాళ్లు, చేతులపై దారుణంగా దాడి చేశారు. ఆపై తన అనుచరులను ఉసిగొల్పి హరికృష్ణను చంపేందుకు ప్రయత్నించారని, ఈ విషయాన్ని బయటకు చెబితే ప్రాణాలు తీస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎడమ చేతికి ఫ్రాక్చర్.. ఆసుపత్రిలో శస్త్రచికిత్స
ఈ దారుణ దాడిలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణ ఎడమ చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడమే కాకుండా తీవ్ర రక్తస్రావం, రక్తపు వాంతులు అయ్యాయి. ఘటన సమాచారం అందుకున్న కానిస్టేబుళ్లు బాధితుడిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా, అక్కడి నుంచి అతడు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లారు. మొదట గాంధీ ఆసుపత్రిలో, ఆ తర్వాత చంగిచెర్ల, ఉప్పల్‌లోని శ్రీ హెల్త్ కేర్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం పొందారు. దాడి తీవ్రత వల్ల ఆగస్టు 10న ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. నిందితుల నుంచి ప్రాణహాని ఉందనే భయం , ఆసుపత్రి చికిత్స కారణాల వల్ల ఫిర్యాదు చేయడంలో ఆలస్యమైనట్లు హరికృష్ణ తెలిపారు.
ఏడుగురిపై ఆరోపణలు.. దర్యాప్తు వేగవంతం
తనను హత్య చేయాలనే దురుద్దేశంతోనే దాడి చేశారని పేర్కొంటూ హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేడిపల్లి ఎస్ఐ బిఎన్ఎస్ (BNS) సెక్షన్లు 109, 3(5) కింద జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో సుమంత్‌తో పాటు ప్రశాంత్, అరుణ్ కుమార్ రెడ్డి, కార్తీక్, మహేందర్ రెడ్డి, రాము , మరికొందరిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఘటన జరిగిన ప్రదేశం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుండటంతో కేసు ఫైళ్లను అక్కడికి పంపించారు. ఫిర్యాదులోని ఆరోపణల ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసులు పూర్తి ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తును వేగవంతం చేశారు.

