Site icon NTV Telugu

Jagadish Reddy: దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారు

Jagadish Reddy On Kcr

Jagadish Reddy On Kcr

Minister Jagadish Reddy Praises CM KCR: దేశంలో ఎన్నో పార్టీలు వచ్చాయి, పోయాయి.. కానీ టీఆర్ఎస్ మాత్రం ప్రజల గుండెల్లో నిలిచిపోయిందని మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. చౌటుప్పల్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం, వనభోజన కార్యక్రమంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సభ్యులంతా కలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఆత్మీయ సమ్మేళనం, వనభోజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని స్పష్టం చేశారు. కులాలకు, మతాలకు అతీతంగా టీఆర్ఎస్ పార్టీలోని నేతలందరూ ఒకే కుటుంబంలా కలిసి ఉంటున్నామన్నారు. ఎవరూ ఊహించని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని చెప్పారు. 60 ఏళ్ళ నుంచి వెంటాడుతున్న ఫ్లోరోసిస్ సమస్యను ఆరేళ్లలోనే పరిష్కరించి.. చరిత్రలో కేసీఆర్ తిరుగులేని ఘనత సాధించారని కొనియాడారు.

లక్షల కోట్లతో ఈ ప్రాంతంలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులకు అంకురార్పణ చేశారని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. సీఎం ఆకాంక్ష మేరకు మనందరం నడుచుకుందామని, ఏ పిలుపునిచ్చినా కంకణ బద్ధులమై పని చేద్దామని పిలుపునిచ్చారు. అప్పు లేకుండా రైతు వ్యవసాయం చేయాలనే ఆలోచనతోనే కేసీఆర్ ‘రైతు బంధు’ పథకాన్ని అందిస్తున్నారన్నారు. అలాగే.. దళితులు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలనే ‘దళిత బందు’ తీసుకొచ్చారని, గిరిజనుల కోసం ‘గిరిజన బంధు’ పథకం కూడా రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు. దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ నాయకత్వం వైపే చూస్తున్నారని, ఇలాంటి నాయకుడే తమకు కావాలని ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ వస్తేనే తెలంగాణలోని పథకాలు తమ రాష్ట్రాల్లో అమలవుతాయని ఆశ పడుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version