Site icon NTV Telugu

Jagadish Reddy: మోడీ తెలంగాణకు ఇచ్చిందేమీ లేదు.. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే

Jagadish Reddy On Modi

Jagadish Reddy On Modi

Minister Jagadish Reddy Fires On PM Modi Governor Tamilisai: తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారి ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. మోడీ తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదని, నయా పైసా ఇవ్వకుండా అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. మునుగోడులో ఓడిపోయిన అక్కసుతోనే నిన్న మోడీ మాట్లాడినట్టు ఉందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలను తాము బీఆర్ఎస్‌తో దేశమంతా ప్రచారం చేస్తామన్నారు. ఇక గవర్నర్ తమిళిసై.. గవర్నర్‌గా కాకుండా బీజేపీ కార్యకర్తలా పని చేస్తున్నారని విమర్శించారు. గవర్నర్ రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మొదటి కార్యాలయం నాంపల్లిలో ఉంటే, రెండో కార్యాలయం రాజ్ భవన్‌లో ఉందన్నారు. ఒకవేళ గవర్నర్ ఆరు బిల్లులను ఆమోదించకపోతే.. తాము న్యాయపరంగా ముందుకు వెళ్తామని జగదీశ్ రెడ్డి తేల్చి చెప్పారు.

అంతకుముందు కూడా మోడీ తెలంగాణ పర్యటనపై జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్‌పై విషం చిమ్మేలా మోదీ వ్యాఖ్యానించార‌ని, మునుగోడులో బీజేపీ ఓట‌మిని జీర్ణించుకోలేకే మోడీ తన అక్కసునంతా వెళ్లగ‌క్కార‌న్నారు. బ్యాంకు లోన్లు రాకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న బీజేపీ.. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం స్వామీజీలను రంగంలోకి దింపి, టీఆర్ఎస్ పార్టీలో అలజడి చేసేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపణలు చేశారు. నాయకులు, పార్టీలను భయపెట్టి.. ఎదురులేకుండా చేసేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతోందన్నారు. సీఎం కేసీఆర్‌పై విషం కక్కినా తెలంగాణ ప్రజలు హంసల్లాంటి వారని.. నీళ్లు, పాలను వేరు చేసినట్టు విషాన్ని కూడా వేరు చేసే సామర్థ్యం వారికి ఉందని పేర్కొన్నారు. అబద్ధాల పునాదుల మీద పార్టీ విస్తరణకు మోడీ ప్రయత్నిస్తున్నారన్నారు. గ్యాస్, పెట్రోల్ ధరల్ని అమాంతం పెంచేసి.. పేదల బతుకులను ఆగం చేసిన వారెవరన్నది ప్రజలు గ్రహించారన్నారు. దేశంలో బీజేపీ పీడను వదిలించుకునేందుకు.. కేసీఆర్ నాయకత్వంలో ముందుకు పోతామ‌ని చెప్పారు.

Exit mobile version