Site icon NTV Telugu

Harish Rao: హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణను మళ్లీ ఏపీలో కలిపే కుట్ర

రాష్ట్ర విభజనపై రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ తెలంగాణపై మరోసారి అక్కసు వెళ్లగక్కారని, అమరుల త్యాగాలను కించపరచారని మండిపడ్డారు. మోదీ వ్యాఖ్యలు గమనిస్తే తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలిపే కుట్ర చేస్తున్నట్లు అనిపిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర సాధన కోసం వేల మంది ప్రాణాలు అర్పించారని, ఆ అమరుల త్యాగాలను మోదీ అవమానిస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణపై విషం చిమ్మడమే మోదీ పనిగా పెట్టుకున్నారని మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లాయని, తెలంగాణ ఏర్పాటుపై మోదీ చేసిన వ్యాఖ్యలను ఇక్కడి బీజేపీ నేతలు ఎలా సమర్థించుకుంటారని ఆయన నిలదీశారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ పురోగతి సాధిస్తుందని తేల్చిచెప్పారు. దేశంలో ఎంపీలు దత్తత తీసుకున్న టాప్-10 గ్రామాలలో బెస్ట్ ఏడు గ్రామాల అవార్డులు తెలంగాణకే వచ్చాయని, తమ ప్రభుత్వ పనితీరుకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. వలస కార్మికుల వల్లే కరోనా వచ్చిందని మోదీ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కుంభమేళా నిర్వహించినప్పుడు, ట్రంప్‌ సభలు, రోడ్‌ షోలు నిర్వహించినప్పుడు కరోనా పెరగలేదా? అని హరీష్‌రావు నిలదీశారు.

Exit mobile version