Minister Harish Rao Calls People Not To Believe Opposition Party Leaders: ఓట్ల కోసమే ప్రతిపక్ష పార్టీలన్నీ తప్పుడు మాటలు మాట్లాడుతున్నాయని, వారిని నమ్మొద్దని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. కొండపాక మండలంలో మంత్రి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ప్రసంగించిన ఆయన.. రాష్ట్రంలో ఒకప్పుడు ట్యాంకర్లతో చెరువులు నింపుకునే పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు ఆ చెరువులు నిండుకుండలా మారాయని చెప్పారు. తాగడానికి గుక్కడు నీళ్లు లేక కష్టపడిన సిద్దిపేట జిల్లా ప్రజలకు.. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రాజెక్ట్‌ల నిర్మాణాలపై ప్రతిపక్షాలు చేస్తోన్న గ్లోబల్ ప్రచారాన్ని మానుకోవాలని సూచించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని.. దాంతో ఏడాదికి రెండు సార్లు వరి పంట సాగు అవుతుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. దేశానికే అన్నం పెట్టే స్థాయికి నేడు తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. నాడు ఉపాధి కోసం తెలంగాణ వాళ్లు వలస వెళ్లేవారని, నేడు వలస కూలీలు ఇక్కడికి వచ్చి జీవనోపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. ఇదే సమయంలో.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా? అంటూ కేంద్రంలోని బీజేపీని హరీశ్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత సంక్షేమ పథకాలు రద్దు చేయాలని బీజేపీ అనడం నిజంగా సిగ్గు చేటని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతరం.. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు ఆసరా నూతన పెన్షన్ కార్డులు అందజేసిన మంత్రి హరీశ్ రావు, జప్తి నాచారంలో రూ.50 లక్షలతో ఎస్సీ, గౌడ సంఘం భవనాలు మంజూరు చేశారు.
