Site icon NTV Telugu

Gangula Kamalakar: అగ్నిపథ్ విషయంలో కేంద్రం వైఖరి మారాలి

Gangula

Gangula

అగ్నిపథ్ పథకం విషయంలో కేంద్రం వైఖరి మారాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బిహార్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు కదా.. అక్కడ హింస ఎలా జరిగిందని బండి సంజయ్ ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అక్కడ బీజేపీ కుట్ర చేసిందా అంటూ ప్రశ్నించారు. బండి సంజయ్ మూర్ఖపు, దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారని గంగుల మండిపడ్డారు. యువతను రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని ఆయన పేర్కొన్నారు. రాజకీయ కోణంలో ప్రజల్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చింతకుంటలో పల్లెప్రగతి కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు.

అగ్నిపథ్‌ పథకంపై ప్రభుత్వం కమిటీ వేసి పునరాలోచించాలని గంగుల కమలాకర్‌ సూచించారు. డబ్బులు కోసం యువత ఆర్మీకి వెళ్లట్లేదన్న ఆయన.. దేశ సేవ కోసం వెళ్లాలనుకునే వారిని ఇబ్బందులు పెట్టొద్దన్నారు. పిల్లలతో కేంద్ర ప్రభుత్వ అధికారులు సామరస్యంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. గతంలో ఎలా రిక్రూట్‌మెంట్ జరిగిందో అలానే జరగాలని ఆయన అన్నారు. నాలుగు సంవత్సరాలు కాదు జీవితాంతం సేవలో ఉంటామని యువకులు ముందుకు వస్తున్నారని.. అగ్నిపథ్ విషయంపై కేంద్రం మరోసారి ఆలోచించాలన్నారు. ఏ రాష్ట్రంలో గొడవ అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానాలని ఆయన హితవు పలికారు.

Exit mobile version