కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు మంత్రి గంగుల కమలాకర్. కొనుగోళ్లు చేయకుండా కనీస మద్దతు ధర అంటే ఏం లాభం అని ప్రశ్నించారు. తెలంగాణ పచ్చగా ఉండటం చూసి కేంద్రం ఓర్వలేకపోతోందని విమర్శించారు. కావాలనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతుందని విమర్శించారు. 2020 ఏప్రిల్ నుంచి ఐదు కిలోల ఉచినత బియ్యం అందిస్తున్నామని..90 లక్షల కార్డుల్లో 53 లక్షల మందికి మాత్రమే బియ్యాన్ని అందించిందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందరికి ఉచిత బియ్యం ఇచ్చిందని అన్నారు. ఉచిత బియ్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటి వరకు రూ. 4720 కోట్ల భారం పడిందని అన్నారు.
మిల్లులో ఉన్న వడ్లు, బియ్యంపై ఎఫ్ సీ ఐకి ఎలాంటి అధికారం లేదని గంగుల అన్నారు. బియ్యం ఇచ్చాకే ఎఫ్ సీ ఐకి అధికారం వస్తుందని అన్నారు. తనిఖీల్లో తేడాలు వచ్చినా చర్యల తీసుకోలేదని ఆరోపణలు చేస్తున్నారని.. మార్చ్ లో ఆరు జిల్లాల్లో 40 మిల్లుల్లో ఎఫ్ సీ ఐ తనిఖీలు చేశారని..40,63,000,00 బ్యాగుల ధాన్యం మా వద్ద ఉందని..4,53,896 బ్యాగుల్లో తేడా ఉందని అన్నారు. ఒక్క గింజా తేడా వచ్చినా ప్రభుత్వ ఊరుకోదని..ముక్కు పిండి వసూలు చేస్తామని అన్నారు. రెండోసారి తనిఖీలు చేసి కేవలం 10 మిల్లుల్లో తేడా ఉందని అన్నారు. ఇప్పటికే మూడు మిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెట్టిందని, రెండు మిల్లుల్లో ధాన్యం రికవరీ చేశామని వెల్లడించారు.
చిన్న చిన్న సాకులతో ధాన్యం కొనుగోలు చేయబోమన ఎఫ్ సీ ఐ ప్రతీసారి అనడం తగదని ఆయన అన్నారు. ఎఫ్ సీ ఐ ధాన్యాన్ని తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేశారు. ఇన్నేళ్లు లేనిది ఎఫ్.సి.ఐ. మాపై ఎందుకు దాడి చేస్తోంది.? అని ప్రశ్నించారు. ఆయిల్ కంపెనీలు మా పరిధిలో లేవని.. పెట్రోల్, ఢిజిల్ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పామని.. స్టాకు ఉండీ కూడా ప్రజలకు పెట్రోల్, డిజిల్ ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని గంగుల అన్నారు. మొత్తం 6584 కొనుగోలు కేంద్రాల్లో, 4200 కేంద్రాలలో పూర్తి 47,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ఆయన వెల్లడించారు.
