Site icon NTV Telugu

Lionel Messi : తెలంగాణకి మెస్సీ మెగా విజిట్.!

Cm Revanth Reddy

Cm Revanth Reddy

Lionel Messi : ఫుట్‌బాల్ ప్రపంచాన్ని తన ప్రతిభతో మంత్రముగ్ధులను చేసిన ఆర్జెంటీనా లెజెండ్ లియోనెల్ మెస్సీ ఈ డిసెంబర్‌లో హైదరాబాద్ రానున్నాడు. The G.O.A.T India Tour – 2025లో భాగంగా భారత పర్యటనకు సిద్ధమైన మెస్సీ, ఈ కార్యక్రమం సందర్భంగా హైదరాబాద్‌ను సందర్శించనున్నట్టు అధికారికంగా వెల్లడైంది. ఫుట్‌బాల్ అభిమానులకు ఇది అద్భుతమైన అవకాశంగా మారనుంది.

తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘తెలంగాణ రైజింగ్’ గ్లోబల్ ప్రమోషన్‌లో భాగంగా, మెస్సీని రాష్ట్రానికి గ్లోబల్ బ్రాండ్ అంబాసడర్‌గా ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు కలిగిన మెస్సీ, ఇండియాలో ఒక్క బ్రాండ్ ఎండోర్స్‌మెంట్‌కే సంవత్సరానికి 100 కోట్లకు పైగా వసూలు చేస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి సూపర్ స్టార్‌ను తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ కార్యక్రమానికి అనుసంధానం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

 

మెస్సీ తన ‘GOAT టూర్ – 2025’లో భాగంగా డిసెంబర్ 13న హైదరాబాద్‌ను సందర్శించనున్నారు. కోల్‌కతా, ముంబై, ఢిల్లీతో పాటు హైదరాబాద్‌లోనూ ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు ఈ టూర్ ప్రత్యేక అనుభవాన్ని అందిస్తోంది. టూర్‌లో మెస్సీతో పాటు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డీ పాల్ వంటి స్టార్ ఫుట్‌బాల్ ఆటగాళ్లు కూడా పాల్గొననున్నారు. హైదరాబాద్‌లో డిసెంబర్ 13న రాత్రి 7:30 గంటలకు ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మెస్సీ చేరుకుంటారు. ఈ సందర్భంగా 7v7 ఎగ్జిబిషన్ మ్యాచ్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసారు. ఈ మ్యాచ్‌కు టికెట్లు ఇప్పటికే డిస్ట్రిక్ట్ యాప్‌లో అందుబాటులోకి వచ్చాయి.. వేగంగా అమ్ముడవుతున్నాయి కూడా.

టూర్‌లోని ఇతర షెడ్యూల్‌లో కూడా మెస్సీ కీలక నగరాలను సందర్శించనున్నాడు. డిసెంబర్ 13 ఉదయం 10.30కి కోల్‌కతా సాల్ట్ లేక్ స్టేడియం, డిసెంబర్ 14 సాయంత్రం 5.30కి ముంబై వాంఖడే స్టేడియం, డిసెంబర్ 15 మధ్యాహ్నం 1.00కి ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం తదితర నగరాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో మాత్రమే కాక, టూర్‌లో 7 వర్సెస్ 7 సెలబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్, యువ ఆటగాళ్ల కోసం మెస్సీ మాస్టర్‌క్లాస్, పెనాల్టీ షూటౌట్స్, మ్యూజిక్ కన్సెర్ట్ వంటి వినూత్న కార్యక్రమాలు వేదికగా ఏర్పాటు చేయబడ్డాయి.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ స్పందిస్తూ.. “లియోనెల్ మెస్సీకి ఆతిథ్యం ఇవ్వడానికి నేను ఎదురు చూస్తున్నాను. మన గడ్డపై ఆయనను చూడాలని ప్రతి ఫుట్‌బాల్ అభిమాని కలలు కన్న క్షణం ఇది. హైదరాబాద్ అతనికి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది” అని పేర్కొన్నారు. డిసెంబర్ నెలలో జరగబోయే ఈ టూర్, రాష్ట్రానికి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించే కీలక ఘట్టంగా మారనుంది. మెస్సీ రాకతో హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ ఫీవర్ మరింత పెరుగనుంది.

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Exit mobile version