మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ప్రారంభం కావడంతో ములుగు జిల్లాలోని అడవులన్నీ భక్తజనసంద్రంగా మారాయి. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండగగా పేరొందిన ఈ జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించడం. సారలమ్మ గద్దెపైకి వస్తున్న తరుణంలో వేలాది మంది భక్తులు జంపన్న వాగు వద్దకు పోటెత్తడంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడుతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా భక్తులందరూ బస్సుల ద్వారా, సొంత వాహనాల ద్వారా నేరుగా వాగు వద్దకు చేరుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
మేడారం వచ్చే ప్రతి భక్తుడు ముందుగా జంపన్న వాగును సందర్శించడం ఒక ఆచారంగా వస్తోంది. ఇక్కడ పుణ్యస్నానం ఆచరించిన తర్వాతే అమ్మవార్ల గద్దెల దర్శనానికి వెళ్లడం సంప్రదాయం. భక్తులు తమ వెంట తెచ్చుకున్న అమ్మవారి ప్రతిమలను వాగులో పవిత్రంగా కడిగి, పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులు తమ ఇళ్ల వద్ద ప్రతిష్టించుకున్న గద్దెలను మేడారం తీసుకువచ్చి, ఇక్కడ జంపన్నకు మొక్కులు అప్పగిస్తారు. తాము కోరుకున్న కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతగా ‘ఎత్తు బంగారం’ అంటే తమ బరువుకు సమానమైన బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పించేందుకు సిద్ధమవుతారు. ముఖ్యంగా అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన వెదురు లంకలను (ఎదురు కర్రలు) పట్టుకుని భక్తిపాటలు పాడుతూ భక్తులు చేసే సందడి జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
NBK 111 : ఎటువంటి మార్పు లేదు.. అవన్నీ పుకార్లే..
జంపన్న వాగుకు కేవలం ఆధ్యాత్మిక ప్రాధాన్యత మాత్రమే కాదు, అద్భుతమైన వీరగాథ కూడా ఉంది. ఒకప్పుడు దీనిని సంపెంగ వాగు అని పిలిచేవారు. 13వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి కాలంలో, గిరిజనులు కరువు కారణంగా కప్పం కట్టలేకపోవడంతో కాకతీయ సైన్యం మేడారంపై దాడి చేసింది. ఆ భీకర యుద్ధంలో సమ్మక్క భర్త పగిడిద్ద రాజు, కుమార్తె సారలమ్మ, అల్లుడు గోవిందరాజులు వీరమరణం పొందారు. తల్లి సమ్మక్కతో కలిసి యుద్ధం చేసిన కుమారుడు జంపన్న తీవ్రంగా గాయపడ్డాడు. శత్రువుల చేతిలో చిక్కడం ఇష్టం లేక, ఆయన ఈ సంపెంగ వాగులోకి దూకి ఆత్మార్పణం చేసుకున్నాడు. జంపన్న చిందించిన రక్తధారల వల్లే వాగు నీరు ఎరుపు రంగులో ఉంటుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. నాటి నుంచి జంపన్న వీరత్వానికి గుర్తుగా ఈ వాగుకు ‘జంపన్న వాగు’ అనే పేరు స్థిరపడిపోయింది.
ప్రస్తుతం జంపన్న వాగు భక్తుల రాకతో సందడిగా ఉంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడే బస చేస్తూ, వాగు జలాలను పవిత్రంగా భావించి నెత్తిన చల్లుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం , అధికారులు జంపన్న వాగు వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. స్నాన ఘట్టాల వద్ద ప్రమాదాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరుకునే సమయం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ వాగులో స్నానం చేస్తే తమ బాధలన్నీ తొలగిపోయి, అమ్మవార్ల ఆశీస్సులు లభిస్తాయని భక్తులు నమ్ముతారు.
MS Dhoni: అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఐపీఎల్ 2028లో కూడా ఎంఎస్ ధోనీ!
