NTV Telugu Site icon

Hyderabad: రూ.5కే భోజనం షురూ

Sabitha Harisrao

Sabitha Harisrao

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో రూ.5కే భోజనం అందించే పథకం మొదలైంది. రోగులతోపాటు ఆస్పత్రులకు వచ్చే సహాయకుల కోసం ఉద్దేశించిన ఈ పథకాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి ఒకేరోజు 18 ఆస్పత్రుల్లో ప్రారంభించడం విశేషం. నగరంతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి నిత్యం ఎంతోమంది ప్రజలు వైద్యం కోసం రాజధానిలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తుంటారు. ప్రతి రోగి వెంట వారి బాగోగులు చూసుకోవడానికి కుటుంబసభ్యులు వస్తుంటారు. ఇలాంటివారికి నామమాత్రపు ఖర్చుతో భోజనం అందించడం ఈ పథకం ఉద్దేశం. ఇప్పటికే గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నగరంలో ఈ పథకాన్ని అమలుచేస్తోంది. ప్రభుత్వ దవాఖానల్లో కూడా దీన్ని అమలుచేయడం ద్వారా పేదలకు మరింత ఊరట లభించనుంది.

ఉస్మానియా ఆస్పత్రిలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు.. తోటి మంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్యే రాజాసింగ్‌లతో కలిసి రూ.5కే భోజనం అందించే పథకాన్ని నిన్న (గురువారం)
ప్రారంభించారు. హెరిటేజ్‌ భవనంతో సంబంధం లేకుండా ఉస్మానియాకు త్వరలో కొత్త భవనాన్ని నిర్మిస్తామని మంత్రి హరీశ్‌రావు ఈ సందర్భంగా చెప్పారు. ఆస్పత్రిలో కొత్తగా నిర్మించిన ఆర్థోపెడిక్స్‌ భవనంతోపాటు కులీకుతుబ్‌ షా భవనంలో లిఫ్ట్‌, ఫార్మసీ తదితర సదుపాయాలు కూడా మొదలయ్యాయి.

ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలకు పురుగుల బియ్యం ఇచ్చేవారని, ఇప్పుడు ప్రతి ఒక్కరికీ 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నామని మంత్రి చెప్పారు. ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో విద్యార్థులకు సన్న బియ్యంతో అన్నం పెడుతున్న ఏకైక ప్రభుత్వం తమదే అన్నారు. వృద్ధుల పింఛన్‌ను రూ.2,016కు పెంచామని, దివ్యాంగులకు రూ.3,016 ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన భోజనం అందించేందుకు డైట్‌ చార్జీలను సైతం పెంచామన్నారు. హరేరామ హరేకృష్ణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని, ఒక్కో భోజనానికి ప్రభుత్వం రూ.21 ఖర్చు చేస్తోందని మంత్రి వివరించారు.

జంటనగరాల్లో మరో 6వేల పడకలు అందుబాటులోకి రానున్నాయని, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులతోపాటు వైద్య సిబ్బందికి క్వార్టర్లు, రోగి సహాయకులకు నైట్‌ షెల్టర్లు కడుతున్నామని హరీశ్‌రావు చెప్పారు. ఉస్మానియా ఆస్పత్రిలో రూ.36 కోట్లతో పనులు మొదలుపెట్టామని, సీఎం ఆదేశాలతో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనం కోసం కమిటీ వేశామని మంత్రి తెలిపారు. కాగా, నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌, పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రిలో చార్మినార్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌, మలక్‌పేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో అక్బర్‌బాగ్‌ కార్పొరేటర్‌ మినాజుద్దీన్‌ రూ.5 భోజనం పథకాన్ని ప్రారంభించారు.

అలాగే వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ఎల్‌బీ నగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో కలిసి పథకానికి శ్రీకారం చుట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌… సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి, ఎర్రగడ్డ చెస్ట్‌ హాస్పిటల్‌లో పథకాన్ని లాంఛనంగా మొదలుపెట్టారు. నిమ్స్‌ ఆస్పత్రిలో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, కొండాపూర్‌లోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ రూ.5 భోజన పథకాన్ని ప్రారంభించారు.

కాగా.. నీలోఫర్‌ ఆస్పత్రిలో ఎమ్మెల్యే ప్రభాకర్‌రావు, ఈఎన్‌టీ ఆస్పత్రిలో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌, కింగ్‌కోఠి ఆస్పత్రిలో ఎమ్మెల్యే రాజాసింగ్‌, నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో ఎమ్మెల్యే మెరాజ్‌ హుస్సేన్‌ చేతుల మీదుగా పథకం మొదలైంది. ఈ పథకం వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా చెప్పారు.

Show comments