Site icon NTV Telugu

Maoists Document : మావోయిస్టుల సెన్సేషనల్‌ డాక్యుమెంట్‌ బట్టబయలు

Maoists

Maoists

Maoists Document : మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలకమైన అంతర్గత డాక్యుమెంట్లు తాజాగా బట్టబయలయ్యాయి. నాలుగు సంవత్సరాల విరామం తర్వాత 2024లో నిర్వహించిన మావోయిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశానికి సంబంధించిన ఈ డాక్యుమెంట్‌లో అనేక సంచలనాత్మక అంశాలు, పార్టీ బలహీనతలపై తీవ్ర ఆత్మవిమర్శ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, ‘ఆయుధాలు వదిలేసి ప్రజల్లోకి వెళ్లాలి’ అనే కీలక అంశం ఈ డాక్యుమెంట్ ద్వారా పార్టీ క్యాడర్‌కు చేరింది. ఈ డాక్యుమెంట్‌ను ఆగస్టు 2024న దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలకు పొలిట్ బ్యూరో పంపినట్లు సమాచారం. డీజీపీల సమావేశంలో కేంద్ర ప్రభుత్వానికి అధికారులు ఈ డాక్యుమెంట్ వివరాలను సమర్పించినట్లు తెలుస్తోంది.

ఈ అంతర్గత డాక్యుమెంట్‌లో గడిచిన మూడేళ్లలో పార్టీ తీవ్ర నష్టాలను, బలహీనతలను ఎదుర్కొన్నట్లు అంగీకరించింది. 2020లో నిర్వహించిన పొలిట్‌బ్యూరో సమావేశంలోనే పార్టీ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు.
గడిచిన మూడు సంవత్సరాలలో 683 మంది మావోయిస్టులు సమావేశాలలో (పోలీసుల ఆపరేషన్లలో) చనిపోయారు. వీరిలో 190 మంది మహిళా సభ్యులు ఉన్నారు.

2021 నుండి పార్టీ నలుగురు కేంద్ర కమిటీ సభ్యులను (లక్ము, అంబీర్, సాకేత్, ఆనంద్) అనారోగ్యం కారణంగా కోల్పోయింది. తర్వాత చాలామంది పోలీసుల ఎన్‌కౌంటర్లలో మృతి చెందగా, మరికొంత మంది అరెస్టయ్యారు. కేంద్ర కమిటీ నుండి ఏరియా లెవెల్ వరకు అనేకమందిని కోల్పోవడంతో పార్టీ తీవ్రంగా బలహీనపడింది. బలగాల చర్యలను తిప్పి కొట్టడంలో కేంద్ర కమిటీతో పాటు స్టేట్, జోనల్ కమిటీలు విఫలమయ్యాయి. ఈస్ట్, సెంట్రల్ రీజియన్స్‌లో కమిటీల మధ్య సమన్వయం లోపించింది.

CM Chandrababu Naidu: ఆధ్యాత్మికత ద్వారానే విశ్వ చైతన్యం సాధ్యం..

నార్త్‌తో పాటు సౌత్ ప్రాంతాలలో కేంద్ర కమిటీ నేరుగా దృష్టి పెట్టలేకపోయింది, అలాగే పార్టీలో ‘గోప్యత’ లోపించింది. గడిచిన మూడు సంవత్సరాలుగా మావోయిస్టులు 669 ఆపరేషన్లను నిర్వహించారు. వీటిలో 261 మంది పోలీసులు మృతిచెందగా, 516 మంది గాయపడ్డారు. ఈ దాడుల ద్వారా 25 వేలకు పైగా ఆయుధాలను స్వాదీనం చేసుకున్నట్లు డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ బలోపేతం కావడానికి, కోలుకోవడానికి ఈ డాక్యుమెంట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2019 పార్టీ వారోత్సవంలో తీసుకున్న కీలక నిర్ణయాల అమలుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. మాస్ బేస్‌ను ఆకర్షించేలా వర్గ పోరాటాన్ని తీవ్రతరం చేయాలని, గడిచిన మూడేళ్లుగా లోపించిన ఈ అంశంపై దృష్టి పెట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా ప్రజలకు ఏ సమస్య ఉన్నా, దాన్ని తమ సమస్యగా భావించి పోరాడాలని ఆదేశించారు.

పార్టీలో రిక్రూట్‌మెంట్ నిరంతరంగా కొనసాగాలని, కొత్త మాస్ ఆర్గనైజేషన్లను ఏర్పాటు చేసుకుంటేనే పార్టీ నిలబడుతుందని పేర్కొన్నారు. పార్టీ కమిటీలలో మూడు జనరేషన్ల సభ్యులు (సీనియర్, మధ్య వయస్కులు, జూనియర్లు) ఉండేలా చూసుకోవాలని నిర్ణయించారు. ‘మాస్ పీపుల్‌కు దగ్గరవటంలో మనం విఫలమయ్యాము’ అని అంగీకరించారు. మారుతున్న పరిస్థితులను తెలుసుకోవడానికి గ్రౌండ్ లెవెల్లో సర్వేలు నిర్వహించి, ఎప్పటికప్పుడు స్థావరాలు మారుస్తూ ఉండాలని సూచించారు.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆయుధాలు వదిలిపెట్టి చర్చల ప్రక్రియ ప్రారంభించాలి అని కీలక నిర్ణయాన్ని డాక్యుమెంట్‌లో ప్రస్తావించారు. ఆయుధాలతో ఉంటే ప్రభుత్వాలు చర్చలు జరపవనే అభిప్రాయాన్ని క్యాడర్‌కు చేరవేయాలని సూచించారు. ఈ అంతర్గత డాక్యుమెంట్ వెలుగులోకి రావడం, ముఖ్యంగా ఆయుధాలను వదిలేయాలనే నిర్ణయం తీసుకోవడం మావోయిస్ట్ పార్టీ చరిత్రలో ఒక కీలక మలుపుగా పరిశీలకులు భావిస్తున్నారు.

CM Chandrababu Naidu: ఆధ్యాత్మికత ద్వారానే విశ్వ చైతన్యం సాధ్యం..

Exit mobile version