Mandula Samuel : సూర్యాపేట జిల్లా రాజకీయంలో తీవ్ర సంచలనం చోటుచేసుకుంది. తుంగతుర్తి కాంగ్రెస్ శాసనసభ్యుడు మందుల సామేల్ సొంత పార్టీకి చెందిన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయంలో కోమటిరెడ్డి సోదరుల వైఖరిని తప్పుబడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఆగ్రహం.. సీఎంతో పాటు పీసీసీ సమాధానం చెప్పాలి
తన నియోజకవర్గంలో తనకు సమాచారం లేకుండా పర్యటించడంపై ఎమ్మెల్యే మందుల సామేల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “తుంగతుర్తికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడనే విషయం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియడం లేదు. స్థానిక శాసనసభ్యుడినైన నాకు తెలియకుండా నా నియోజకవర్గానికి ఎలా వస్తారు? కనీస ప్రోటోకాల్ పాటించరా?” అని ప్రశ్నించారు. కోమటిరెడ్డికి ఎస్సీ నియోజకవర్గాలంటే చిన్నచూపని, మాదిగలపై వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. మాదిగలు ఎవరికీ బానిసలు కాదని స్పష్టం చేసిన ఆయన, ఇదే తరహా పద్ధతి కొనసాగితే ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మా జోలికొస్తే రాజకీయ సమాధి కడతాం
తమ గౌరవానికి భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని, అంతకు అంత ప్రతికారం తీర్చుకుంటామని సామేల్ హెచ్చరించారు. “మా జోలికొస్తే మీ రాజకీయ సమాధికి మేమే డప్పులు కొడతాం, మా దండోరా మోగుతుంది. అహంకార పూరితమైన రాజకీయాన్ని చావుదెబ్బ తీస్తాం” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లా ఎవరి రాజ్యమూ కాదని, ఇది శ్రమజీవుల జిల్లా అని స్పష్టం చేస్తూ, తనతో పాటు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రజల అభిమానంతోనే గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టామని ధీమా వ్యక్తం చేశారు.
కోమటిరెడ్డి సోదరుల వైఖరిపై తీవ్ర విమర్శలు
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై కూడా మందుల సామేల్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. గతంలో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి ఎందుకు వెళ్లారో రాజగోపాల్ రెడ్డి ముందుగా సమాధానం చెప్పాలని నిలదీశారు. మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి తీరుపై తమకు పూర్తి రిపోర్టు వచ్చిందని వ్యాఖ్యానించారు. నాయకులు తమ నియోజకవర్గాలపై దృష్టి సారిస్తే మంచిదని, ఎస్సీ స్థానాలైన తమ సీట్లపై ఇతరుల పెత్తనం ఏంటని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు.

