ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీల నాయకులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఆయన రాజకీయాల్లో, సినీ రంగానికి చేసిన సేవలను కొనియాడుతున్నారు. కేవలం 9 నెలల్లోనే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడంపై నాయకులు స్పందించారు. ఎన్టీఆర్ తీసుకువచ్చిన కొన్ని పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని తెలుగుదేశం, టీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులు ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఎంపీ నామా నాగేశ్వర్ రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు సండ్రవెంకట వీరయ్య వంటి వారు మహానేతకు ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తాం అని అన్నారు.
ఇదిలా ఉంటే మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలోని ధర్మారం బీ గ్రామంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సంచనల వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ ఇద్దరూ టీడీపీ వారే అని ఆయన వ్యాఖ్యానించారు. ఇద్దరూ కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వారే అని అన్నారు. అయితే ఎన్టీఆర్ కు వ్యతిరేఖంగా నిలబడటాన్ని గురించి ఆయన స్పందించారు. ఆనాడు ఎన్టీఆర్ కు వ్యతిరేఖంగా నిలబడ్డందుకు ఇప్పటికీ బాధపడుతున్నానని అన్నారు.
