తన చిన్ననాటి స్నేహితుడ్ని ఓ వ్యక్తి దారుణంగా మోసం చేశాడు. స్నేహాన్ని అడ్డం పెట్టుకొని, అతని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసి మందలించడంతో, చివరికి భార్యని తీసుకొని పరారయ్యాడు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మంతట్టి గ్రామానికి చెందిన గుడాల పరమేశ్, పావని భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన పిట్టలి విశ్వనాథ్, పరమేశ్ చిన్ననాటి స్నేహితులు. వీళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసి ఉండేవారు. ఈ నేపథ్యంలోనే పరమేశ్ భార్యతో విశ్వనాథ్ సన్నిహితంగా మెలిగేవాడు. ఇది వివాహేతర సంబంధానికి దారి తీసింది.
భార్య, స్నేహితుడు తన వెనకాల కొనసాగిస్తోన్న రాసలీలల విషయం తెలిసి.. వాళ్ళిద్దరినీ మందలించాడు. అయినా వారిలో మార్పు రాకపోగా, మరింత రెచ్చిపోయాడు. దీంతో, పరమేశ్ గ్రామంలో పంచాయితీ పెట్టించాడు. అప్పట్నుంచి పావని, విశ్వనాథ్ దూరంగా ఉంటూ వచ్చారు. ఇక అన్నీ సవ్యంగానే సాగుతున్నాయిలే అని పరమేశ్ అనుకుంటున్న తరుణంలో.. అతని భార్య పావని పెద్ద ఝలక్ ఇచ్చింది. గత నెల 30వ తేదీన తన ఇద్దరు పిల్లలతో కలిసి కనిపించకుండాపోయింది. తన స్నేహితుడిపై అనుమానం రావడంతో.. అదే రోజు పరమేశ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన భార్య, ఇద్దరు పిల్లలతో పాటు నాలుగు తులాల బంగారం, రూ. 42 వేలు కూడా విశ్వనాథ్ తీసుకెళ్ళాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
అయితే, ఇంతలో మరో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కేసుని విచారిస్తున్న క్రమంలోనే, విశ్వనాథ్ మూడు నెలల క్రితమే అనురాధ ఓ యువతిని పెళ్ళి చేసుకున్న విషయం బయటపడింది. ఆమె కూడా, మరో మహిళను తీసుకొని తన భార్త పారిపోయాడని కేసు నమోదు చేసింది. ఈమేరకు పోలీసులు విశ్వనాథ్, పావనిలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన ఆ జంట ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.
