Malla Reddy Comments On Boora Narsaiah Goud: మునుగోడు ఉప ఎన్నిక అభివృద్ధి కోసం రాలేదని.. రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్‌ల కోసమే వచ్చిందని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. మూడేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి.. ఈ సమయంలో ఒక్కసారి కూడా నియోజకవర్గంలోకి రాలేదని విమర్శించారు. కళ్యాణ లక్ష్మీ చెక్కులు కూడా పంపిణీ చేయలేదని ఆరోపించారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా చేసిన రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడు కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచి, ఆ పార్టీని నట్టేట ముంచారని ఆగ్రహించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కనీసం డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. మూడేళ్ల నుంచి నియోజకవర్గానికి ఏం చేయనిది.. ఇప్పుడు ఉప ఎన్నికల్లో గెలిచి ఏం చేస్తావని రాజగోపాల్ రెడ్డిని నిలదీశారు.
ఇదే సమయంలో.. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పార్టీ మారడంపై కూడా మంత్రి మల్లారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు బూర నర్సయ్య ఎవరో ప్రజలకు తెలియదని.. కేసీఆర్ బొమ్మ మీద ఆయన ఎంపీగా గెలిచాడని చెప్పారు. బూర నర్సయ్య గౌడ్ పార్టీ మారినంత టీఆర్ఎస్‌కు నయా పైసా నష్టం లేదని తేల్చి చెప్పారు. రాజగోపాల్ రెడ్డి తమ్ముడే ఈ బూర నర్సయ్య అని కౌంటర్ వేశారు. ఐదేళ్లు ఎంపీగా కొనసాగిన ఆయన.. ఒక్కసారి కూడా నియోజకవర్గానికి రాలేదని, ప్రజల సమస్యల్ని తీర్చలేదని అన్నారు. అందుకే బూర నర్సయ్యను ప్రజలు ఓడగొట్టారన్నారు. ఇప్పుడు ఆయన్ను ప్రజలు పూర్తిగా మర్చిపోయారని పేర్కొన్నారు. కాగా.. తాను ఎన్నో అవమానాల్ని దిగమింగానని, పార్టీకి తన అవసరం లేదనిపించిందని పేర్కొంటూ బూర నర్సయ్య రాజీనామా చేసిన విషయం తెలిసిందే! ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కి ఇచ్చిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
‘‘మీ నాయకత్వంలో రాష్ట్ర సాధన కోసం శక్తివంచన లేకుండా పనిచేశానుఎంపీగా గెలిచిన తర్వాత ప్రజల కోసం ఎంతో కష్టపడ్డాను. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా పనులు చేశాను. మళ్లీ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు కానీ, కానీ స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. బుల్డోజర్ గుర్తు.. అంతర్గత కుట్రలతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తాయని అనిపించి, మీ దృష్టికి తీసుకురావాలనుకున్నా. కానీ అవకాశం దొరకలేదు. ఇక నేను టీఆర్ఎస్‌లో ఉండి ఏం చేయాలి? మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నాతో ఒక్కసారి కూడా సంప్రదించలేదు. ఎన్నో అవమానాలను దిగమింగాను. నా అవసరం పార్టీకి లేదని అనిపించింది’’ అని బూర నర్సయ్య లేఖలో తెలిపారు.