తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలుస్తుందని.. పార్టీ సర్వేలో అదే తేలిందని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ చెప్పారు. కాంగ్రెస్‌ను ఢీకొట్టే పరిస్థితి బీజేపీకి ఏమాత్రం లేదని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో మంత్రులుగా చేసిన కొందరు కోట్లు సంపాదించారని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మాత్రం వాళ్లు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. అలాంటి వాళ్లకు తాము బుద్ధి చెప్తామని హెచ్చరించారు. పార్టీ బలమే కార్యకర్తలని వెల్లడించారు. తెలంగాణకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పిలుస్తున్నామని చెప్పిన మధుయాష్కీ గౌడ్.. సోనియా గాంధీతో ఒక ప్రత్యేకమైన సభకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు.
ఇదిలావుండగా.. సుబ్బిరామిరెడ్డి సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడిగా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిద్రలేకుండా చాలా పని చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని అన్నారు. తనని ఎవరైనా విమర్శిస్తే తొనకనని చెప్పిన ఆయన.. విమర్శించిన వాళ్లైనా తన వద్దకు సాయం కోసం వస్తే తప్పకుండా సాయం చేస్తానన్నారు. తన ఎదుగుదలని చూసి కొందరు ఇబ్బంది పడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో, భట్టి విక్రమార్క సహకారంతో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
