Big Rain Alert: బంగాళాఖాతంలో మరో తుఫాన్ ముప్పు.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

Ap, Ts Rains

Ap, Ts Rains

బంగాళాఖాతంలో మరోసారి వాతావరణ మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. రేపు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏర్పడనున్న ఈ అల్పపీడనం క్రమంగా పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. రానున్న 24 గంటల తర్వాత సముద్రంలో గాలుల వేగం పెరిగి, అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈ వాయుగుండం మరింత బలపడి తుఫాన్‌గా రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి. తుఫాన్‌గా మారిన తర్వాత ఇది తన దిశను మార్చుకుని ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీని ప్రభావంతో రాబోయే మూడు నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.

సముద్రం అల్లకల్లోలంగా మారనున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన వారు తక్షణమే తీరానికి చేరుకోవాలని సూచించారు. మరోవైపు, వరి కోతల సమయం కావడంతో అకాల వర్షాల హెచ్చరికలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పంట నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. అల్పపీడనం కదలికలను, తుఫాన్ తీవ్రతను వాతావరణ కేంద్రం నిరంతరం పర్యవేక్షిస్తోంది. రాబోయే 48 గంటల్లో దీని గమనంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తీర ప్రాంత ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.