Site icon NTV Telugu

Local Body Elections : రెండో విడతలోనూ కాంగ్రెస్ హవా

Local Body Elections

Local Body Elections

Local Body Elections : తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ఈ విడతలో మొత్తం 85.76% పోలింగ్ నమోదైంది. జిల్లా వారీగా చూస్తే, యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 92% పోలింగ్ నమోదు కాగా, నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా 76% నమోదైంది.

మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 3,911 గ్రామ పంచాయతీలకు మరియు 29,000 పైచిలుకు వార్డు మెంబర్లకు సంబంధించిన కౌంటింగ్ సజావుగా జరుగుతోంది. చిన్న గ్రామ పంచాయతీల్లో ఫలితాలు త్వరగా వస్తున్నప్పటికీ, పెద్ద పంచాయతీల్లో కొంత ఆలస్యం అవుతోంది. బ్యాలెట్ బాక్స్‌లను ఓపెన్ చేసిన తర్వాత, వాటిని వేరు చేసి, 25 బండిల్స్‌గా కట్టడం మరియు సర్పంచ్, వార్డు మెంబర్ల ఓట్లను విడదీయడం వంటి ప్రక్రియ కారణంగా ఈ ఆలస్యం జరుగుతోంది.

గతంలో మొదటి విడత కౌంటింగ్‌లో ఎదురైన ఆలస్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈసారి రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ముఖ్యమైన వెసులుబాటు కల్పించింది. ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో లేదా పోలింగ్ అధికంగా నమోదైన చోట, కౌంటింగ్ వేగవంతం చేయడానికి అవసరాన్ని బట్టి రెండు లేదా మూడు టేబుల్స్‌ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చని సూచించడం జరిగింది. ఈ చర్యల వలన కౌంటింగ్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం, రెండో విడతలో కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దాదాపు 900 పైచిలుకు స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించినట్టు తెలుస్తోంది, అలాగే సుమారు 350 వరకు స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందినట్టు సమాచారం. ఈ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నప్పటికీ, పార్టీల మద్దతుతో పోటీ చేసిన వారిలో ఇతరుల సంఖ్య కూడా గణనీయంగానే ఉందని తెలుస్తోంది.

మొత్తం 3,911 గ్రామ పంచాయతీలకు సంబంధించిన తుది ఫలితాలు ఈరోజు రాత్రి వరకు వెలువడే అవకాశాలు ఉన్నాయి. కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత, కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యులతో ఉప సర్పంచ్‌కు సంబంధించిన ఎన్నికను వెంటనే నిర్వహించాల్సి ఉంటుంది, దీని తర్వాతే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసినట్టు అవుతుంది.

IND vs PAK U-19: సీనియర్లే కాదు జూనియర్స్ కూడా.. భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తు..!

Exit mobile version