Site icon NTV Telugu

Latest Weather Update: చలి తీవ్రత తగ్గుముఖం పట్టినా పొంచి ఉన్న సంక్రాంతి ముప్పు

Coold

Coold

Latest Weather Update: తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా ప్రజలను గజగజ వణికించిన చలి తీవ్రత ప్రస్తుతం కొంత మేర తగ్గుముఖం పట్టింది. ఇటీవల అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయి రికార్డు స్థాయి చలి నమోదైనప్పటికీ, గత రెండు రోజుల నుండి వాతావరణంలో మార్పులు రావడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. అయితే ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, జనవరి నెల ప్రారంభంలో సాధారణ శీతాకాల పరిస్థితులు ఉన్నప్పటికీ, సంక్రాంతి పండుగ సమయానికి చలి మళ్లీ తన ప్రతాపం చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంక్రాంతి తర్వాత జనవరి చివరి వారం నుండి మాత్రమే శీతాకాలం క్రమంగా వీడుకోలు పలుకుతూ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని విశ్లేషిస్తున్నారు.

IAS: ఐఏఎస్ కిషోర్ కుమార్ భార్య సత్య దీపిక అనుమానాస్పద మృతి..

ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కీలక వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం దిగువ ట్రోపో ఆవరణలో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం , రాయలసీమ ప్రాంతాల్లో ఈశాన్య , తూర్పు దిశల నుండి గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొంటుందని, అక్కడక్కడా ఒకటి రెండు చోట్ల స్వల్పంగా పొగమంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే రాగల ఐదు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతల నమోదులో పెద్దగా మార్పులు ఉండబోవని, అంటే చలి తీవ్రత ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే కొనసాగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా వాతావరణ పరిస్థితులు ఇంచుమించు ఇలాగే ఉన్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా తూర్పు , ఆగ్నేయ దిశల నుండి వీస్తున్నాయి. వీటి ఫలితంగా వచ్చే మూడు రోజుల వరకు తెలంగాణవ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మొత్తానికి రెండు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతానికి భారీ ఉష్ణోగ్రతల తగ్గుదల లేకపోయినప్పటికీ, పొడి వాతావరణం , పొగమంచు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పండుగ నాటికి చలి మళ్లీ పెరిగే సూచనలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Free Tablet Scheme: విద్యార్థులకు ఉచిత టాబ్లెట్లు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా!

Exit mobile version