Site icon NTV Telugu

KTR Tweet: గవర్నర్ తీరుపై కేటీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..

Tamilasai

Tamilasai

KTR Tweet: బీజేపీ రాష్ట్రాలపై కక్ష సాధింపు కోసమే గవర్నర్లను వాడుకుంటున్నారని ఐటీ మంత్రి కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్రం వైఖరిని మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించారు. గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని సూచిస్తూ తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొంతం దిలీప్ చేసిన ట్వీట్ ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు కేటీఆర్ తన వ్యాఖ్యను జోడించారు. తమ అధికారాలను నిర్దాక్షిణ్యంగా దుర్వినియోగం చేస్తున్న దేశంలోని బీజేపీయేతర రాష్ట్రాల్లోని గవర్నర్లపై తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న తీర్మానానికి మద్దతుగా కొంతం దిలీప్ ట్వీట్ చేశారు.

బ్రిటిష్ కాలం నాటి గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ గవర్నర్ కూడా కొన్ని బిల్లులను పెండింగ్‌లో ఉంచారని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో స్పందించారు. రాజ్యాంగబద్ధంగా ఉన్నత పదవుల్లో ఉన్నవారు కేంద్ర ప్రభుత్వ అధీనంలో రాజకీయ పావులుగా మారారని ఆరోపించారు. బీజేపీయేతర రాష్ట్రాలకు కేంద్రం సహకరించడం లేదని, ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తోందని మంత్రి విమర్శించారు. సహకార సమాఖ్య పాలనకు ఇది ఒక నమూనా కాదా అని ఆయన అడిగారు. టీమ్ ఇండియా స్ఫూర్తిని దెబ్బతీసేలా కేంద్ర వైఖరి ఉందని, ఇది దేశ ప్రగతికి, సామరస్యానికి ఎలా దోహదపడుతుందని మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో ప్రశ్నించారు.

Exit mobile version