Site icon NTV Telugu

KTR : ఉపఎన్నికలే కాంగ్రెస్‌కు గుణపాఠం

Ktr

Ktr

KTR : భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (కల్వకుంట్ల తారక రామారావు) కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌ పరిధిలోని షేక్‌పేట ప్రాంతంలో పర్యటించిన ఆయన, ప్రజలతో కలసి ప్రత్యేక ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా “కాంగ్రెస్‌ బకాయి కార్డు” అనే వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టారు. కేటీఆర్‌ తన బృందంతో కలిసి ఇంటింటికీ వెళ్లి బకాయి కార్డులను అందజేశారు. వాటిలో ప్రతి వర్గానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంత బాకీ ఉందో, ఏ ఏ వాగ్దానాలు నెరవేర్చలేదో స్పష్టంగా వివరించారు. ఈ కార్డుల ద్వారా కాంగ్రెస్‌ చేసిన మోసాలను, అసత్య వాగ్దానాలను ప్రజలకు తెలియజేయడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్‌ మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు అన్నీ మోసమే. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఇప్పుడు మాట తప్పుతున్నారు. బకాయి కార్డుల ద్వారా మేము ఈ మోసాన్ని బయటపెడతాం” అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ అహంకారానికి, వాగ్దానభంగానికి గుణపాఠం చెప్పే అవకాశం ఉపఎన్నికలు, స్థానిక ఎన్నికలు రూపంలో వచ్చాయని కేటీఆర్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తప్పక ఓటమి చవి చూడాల్సిందేనని హెచ్చరించారు.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చేవారిని కేటీఆర్‌ “టూరిస్టు మంత్రులు” అంటూ ఎద్దేవా చేశారు. “ఎన్నికలు ముగిసిన వెంటనే ఆ మంత్రులు, సామంతులు అందరూ గాయబ్‌ అయిపోతారు. ప్రజల సమస్యలు ఎవరికీ పట్టవు” అని విమర్శించారు. తమ పక్షాన ప్రజాభిప్రాయం బలంగా మారుతోందని, కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రజల తీర్పు త్వరలోనే స్పష్టమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

 

Exit mobile version