Site icon NTV Telugu

కేంద్ర ప్రభుత్వం రైతులను వేధిస్తుంది: కొప్పుల ఈశ్వర్‌

యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తెలంగాణపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్‌లో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి మంత్రి ఈశ్వర్‌ హాజరయ్యారు. కరీంనగర్‌- రాయపట్నం రహదారిపై మంత్రి బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం మెయిన్‌ రోడ్డు నుంచి మల్లాపూర్‌ దాకా జరిగిన రైతుల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో యాసంగి దొడ్డు ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టత ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం రైతులను వేధిస్తున్నదని దుయ్యబట్టారు.

గత ఆరేండ్లుగా సవ్యంగా దొడ్డు వడ్ల కొనుగోళ్లు జరుగ్గా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేయమని చేతులెత్తేయడం సరికాదని విమర్శించారు. యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్రం తేల్చేదేకా రైతుల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డు వడ్లు కొనమని ఓ వైపు స్పష్టం చేస్తుంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇతర నాయకులు యాసంగిలో వరి సాగు చేయాలని పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్న మాటలను రైతులు నమ్మొద్దని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టతతో వ్యవహరించాలన్నారు.

Read Also:

https://ntvtelugu.com/pv-sindhu-appointed-bwfs-athletes-commission-member/


Exit mobile version