NTV Telugu Site icon

Kollapur TRS: తగ్గేదెలే అంటున్న కొల్లాపూర్ గులాబీ నేతలు

Kollapur

Kollapur

రాబోయే ఏడాది మళ్ళీ ఎన్నికల సంరంభం ప్రారంభం కానుంది. కానీ గులాబీ నేతలు మాత్రం తమ మధ్య విభేదాలు వీడడం లేదు. పెద్దబాస్, చిన్నబాస్ ఎన్ని చెప్పినా ప్రగతిభవన్ లో విని వదిలేస్తున్నట్టు అనిపిస్తోంది. మొన్నటి వరకు రాజకీయంగా మాటల తూటాలు పేల్చుకున్న కొల్లాపూర్ నేతలు , ఇప్పుడు వ్యక్తిగత విమర్శలతో దూషించుకుంటున్నారు. ఇదంతా అధికార విపక్ష పార్టీ నేతల మధ్య అనుకుంటే మీ బిర్యానీలో కాలేసినట్టే. ఈ సీన్ అంతా అధికార టీఆర్ఎస్ లోనే కొనసాగుతుండటంతో ఇప్పుడు అక్కడి రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఆధిపత్య పోరు పార్టీకి తీవ్ర నష్టం జరుగుతున్నా అధిష్టానం దృష్టి సారించకపోవడం పలు రకాల చర్చలకు దారి తీస్తుంది.

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార టీఆర్‌ఎస్ లో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. గులాబీ గూటిలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య ఆధిపత్య పోరు తార స్థాయికి చేరుకుంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జూపల్లి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన బీరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి కారు ఎక్కడంతో కొల్లాపూర్ లో టీఆర్ఎస్ లో అగ్గి రాజుకుంది. తాజా మాజీ నేతల మధ్య ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా ఐక్యత కుదరడం లేదు. అధిష్టానం సైతం దీనిపై దృష్టి సారించక పోవడం తో ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి నెలకొంది. దీనికితోడు నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలను నిర్వహిస్తుండడంతో పార్టీలో ఐక్యత లేదనే అంశం స్పష్టమవుతోంది.

ఇదిలా ఉంటే టీఆర్ఎస్ అధిష్ఠానం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికే ప్రాధాన్యత ఇస్తుండటం తో జూపల్లి వర్గీయులు తమకు ప్రాధాన్యత దక్కడంలేదంటూ దీనిపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటూ కృష్ణారావుపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఓ దశలో జూపల్లి కృష్ణారావు పార్టీ వీడుతున్నాడంటూ ప్రచారం జోరుగా సాగినా…అధికార పార్టీలోనే కొనసాగి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఛాన్స్ దక్కించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పార్టీ సస్పెండ్ చేస్తే తనకు మరోరకంగా మేలు జరుగుతుందని జూపల్లి అండ్ టీం నమ్ముతున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే అధికార పార్టీకి చెందిన నేతలైన జూపల్లి కృష్ణారావు- బీరం హర్షవర్ధన్ రెడ్డి ఇద్దరు బద్ద శత్రువులుగా మారి ఒకరిపై ఒకరు రాజకీయ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇద్దరు నేతలు తగ్గేదేలేదన్నట్లు వ్యవహరిస్తుండటంతో ద్వితీయ శ్రేణి నాయకత్వంతో పాటు గ్రామాల్లో ఉండే కార్యకర్తలు సైతం రెండుగా చీలి దాడులు చేసుకొని పోలీస్ స్టేషన్ల మెట్లెక్కుతున్న పరిస్థితి కొల్లాపూర్ లో నెలకొంది. ఇక ఇద్దరు నేతలు తమ మాటే నెగ్గాలని వ్యవహరిస్తుండటంతో పోలీసు అధికారులతో పాటు , ఇతర అధికారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కొల్లాపూర్ నియోజక వర్గంలో అధికార , విపక్షాల పాత్రను టీఆర్ఎస్ లోని తాజా , మాజీ ఎమ్మెల్యేలు పోషిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఎవరు అధికార పక్షంలో ఉంటారో, ఎవరు విపక్షమవుతారోనని స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మొన్నటి వరకు వివిధ అంశాల్లో బహిర్గతమైన వర్గ పోరు,,, తాజాగా కేఎల్ ఐ కాలువ విషయంలో రచ్చగా మారింది. కల్వకుర్తి ఎత్తి పోతల పథకంలో భాగమైన డి-5 కాలువను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం పూడ్చి వేయడాన్ని మాజీ మంత్రి జూపల్లి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. డి-5 కాలువను పూడ్చడాన్ని నిరసిస్తూ కొల్లాపూర్ నుండి రైతులు కార్యకర్తలతో కలిసి మండల పరిధిలోని సున్నపురాయి తండాకు పాదయాత్ర చేసి హడావిడి చేసారు. దీనంతటికి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డే కారకుడని ఎమ్మెల్యేను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసారు జూపల్లి.

ఇదిలా ఉంటే కొల్లాపూర్ నియోజక వర్గ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి కృష్ణారావు మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు పార్టీకి తీవ్ర నష్టం జరుగుతున్నా, అదిష్టానం దృష్టి సారించకపోవడం పలు రకాల చర్చలకు దారి తీస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో చిన్న చిన్న సమస్యలు వస్తే వెంటనే స్పందించి పరిస్థితిని చక్కదిద్దే అధిష్టానం కొల్లాపూర్ ఆధిపత్యపోరు పై దృష్టి సారించకపోవడం ఏంటనే ప్రశ్నలు క్యాడర్ నుంచి జోరుగా వినిపిస్తున్నాయి. అధిష్టానం కళ్ళు తెరవకపోతే మాత్రం కొల్లాపూర్‌లో పార్టీ పరిస్థితి కష్టాల్లో పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Drunk and Drive : అది కడుపేనా.. 15 బీర్లుతాగి బండిపై వస్తుంటే..!