హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి దారుణం చేసుకుంది. కొంతమంది రౌడీమూకలు ఓ యువకుడిని చితకబాది గొంతుపై కత్తి పెట్టి చంపుతామని బెదిరించారు. వివరాల్లోకి వెళ్తే… సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన నాగార్జున అనే యువకుడు తన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో మెడిసిన్స్ కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ నగరానికి వచ్చాడు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఎల్బీనగర్ నుంచి లక్డీకాపూల్ వరకు మెట్రోలో వచ్చి మెహిదీపట్నం వరకు బస్సులో వచ్చాడు. అప్పటికే రాత్రి 10:30 గంటలు దాటడంతో మెహిదీపట్నం నుంచి ఓయూ కాలనీ వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. అయితే అదే ఆటోలో అప్పటికే సాధారణ ప్రయాణికుల తరహాలో ఇద్దరు యువకులు ఉన్నారు.
Read Also: హైదరాబాద్ మెట్రోకు నాలుగేళ్లు పూర్తి
అయితే ఆటోడ్రైవర్ హఠాత్తుగా ఆటోను లంగర్‌హౌజ్ వైపుకు తిప్పడంతో.. ఈ రూట్‌లో ఎందుకు వెళ్తున్నావని నాగార్జున ప్రశ్నించాడు. దీంతో ఆటోలోని ఇద్దరు యువకులు నాగార్జున గొంతుపై కత్తి పెట్టి అరిస్తే చంపుతామని బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన నాగార్జున వాళ్లు చెప్పినట్లు చేశాడు. ఆటో లంగర్‌హౌజ్‌లోని సన్ సిటీ దాటిన తర్వాత ఆటో ఆపి నాగార్జునను చితకబాదిన రౌడీ మూకలు అతడి వద్ద ఉన్న రూ.3వేల నగదు, రూ.20వేలు విలువైన సెల్‌ఫోన్ లాక్కున్నారు. అనంతరం ఆటో నుంచి నాగార్జునను తోసేసి వాళ్లు పరారయ్యారు. కాగా ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
