Kishan Reddy Says Secunderabad Railway Station Will Be Build Like Airport: నిజాం కాలంలో కట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను 653 కోట్లతో ఆధునీకరిస్తామని.. ఎయిర్‌పోర్టుకి ధీటుగా నిర్మిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ నెలలోనే పనులు మొదలుపెడతామని అన్నారు. రైల్వే ప్రమాదాల నివారణ కోసం అనేక చర్యలు తీసుకున్నామని, మసాయిపేటలో చోటు చేసుకున్న రైల్వే ప్రమాద ఘటన విచారకరమని తెలిపారు. ప్రయాణికుల భద్రత కోసం అన్ని రైల్వే స్టేషన్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. మెదక్ రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై అందుబాటులో ఉందన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఇప్పటివరకూ 16 జాతీయ స్థాయి అవార్డులను అందుకుందని చెప్పారు. భద్రాద్రి- సత్తుపల్లి రైల్వే లైన్ కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ పూర్తయితే.. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్‌కి పోటీగా ఉంటుందని తెలిపారు. మనోహరబాద్- కొత్తపల్లి 150 రైల్వే లైన్ త్వరలోనే పూర్తవుతుందన్నారు.
రైల్వే శాఖతో ప్రధాని మోదీ ప్రతి నెల సమీక్షలు నిర్వహిస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 450 కోట్లతో వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనుల్ని త్వరలో పూర్తి చేస్తామన్నారు. దీని వల్ల 3 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. చేగుంటలో టికెటింగ్ కౌంటర్ ఏర్పాటు చేయాలని అభ్యర్థన వచ్చిందని.. అందుకు జీఎమ్ ఓకే చెప్పారని వెల్లడించారు. రామయంపేట – సిద్దిపేట రోడ్డును కూడా నేషనల్ హైవేతో కనెక్ట్ చేశామన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని.. కేంద్ర ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఈ రాష్ట్రానికి ఉంటుందన్నారు. భూములు ఇచ్చిన రైతులకు మోడీ తరపున తాను సెల్యూట్ చేస్తున్నానన్నారు. భద్రాచలం దేవాలయం అభివృద్ధి కోసం టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా నిధులిచ్చామని, రామప్ప కోసం రూ. 60 కోట్ల నిధులిచ్చామని రివీల్ చేశారు. కాగా.. అక్కన్నపేట-మెదక్ మధ్య రైల్వే సేవలు నేటినుంచి అందుబాటులోకి వచ్చాయి. తొలిరైలుని మంత్రి హరీశ్ రావుతో కలిసి కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.